![]() |
![]() |
.jpg)
ప్రముఖ రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించగా 2019 తానా బహుమతి పొందిన నవల 'కొండపొలం' ఆధారంగా డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తోన్న సినిమాకు అదే టైటిల్ ఖరారు చేశారు. వైష్ణవ్‌తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న ఈ మూవీ టైటిల్ లోగోతో పాటు, హీరో ఫస్ట్ లుక్ వీడియో గ్లిమ్స్‌ను శుక్రవారం విడుదల చేశారు. వైష్ణవ్‌తేజ్ ఇంటెన్స్ లుక్‌తో గడ్డంతో కనిపిస్తున్నాడు. తలకు ఎరుపు రంగు వస్త్రం బిగించి కట్టాడు. తమ పొలాలనూ, గొర్రెలనూ కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా వెనుకాడని యువకుడిగా ఈ మూవీలో అతను నటిస్తున్నాడు.
ఫస్ట్ గ్లిమ్స్‌లో ఎవరో కొంతమంది దుండగులు కొండపొలంలో నిప్పు రాజేస్తుంటే, చాటు నుంచి ఒక పెద్ద తాడును గురిచూసి వారివైపు విసిరేస్తున్న వైష్ణవ్‌తేజ్ కనిపించాడు. ఆ సీన్‌ను బట్టి ఈ సినిమా ఉద్వేగభరితమైన యాక్షన్ డ్రామా అని అర్థమవుతోంది. కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. 'యాన్ ఎపిక్ టేల్ ఆఫ్ బికమింగ్' అనే అసంపూర్ణ క్యాప్షన్‌తో రిలీజైన ఫస్ట్ గ్లిమ్స్ చూశాక, తర్వాత వచ్చే ప్రమోషన్స్‌తో సినిమాపై మనకో క్లారిటీ రావచ్చు.

అక్టోబర్ 8న థియేటర్లలో ఈ సినిమా రిలీజవుతుందని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. నాజర్, కోట శ్రీనివాసరావు కీలక పాత్రధారులైన ఈ సినిమాలోని పాటలను సీతారామశాస్త్రి, చంద్రబోస్, కీరవాణి రాశారు.

వి.ఎస్. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా, శ్రావణ్ కటికనేని ఎడిటర్‌గా, వెంకట్ స్టంట్ మాస్టర్‌గా వర్క్ చేసిన 'కొండపొలం' చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

![]() |
![]() |