![]() |
![]() |

సెల్వరాఘవన్ డైరెక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ 'ఆయిరత్తిల్ ఒరువన్' 2010లో వచ్చింది. అందులో కార్తీ, ఆండ్రియా జెర్మియా, రీమా సేన్, పార్తీబన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆ సినిమా తెలుగులో 'యుగానికి ఒక్కడు' పేరుతో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర ఆ మూవీ ఆశించిన రీతిలో ఆడలేదు. కానీ క్రమంగా ఆ సినిమాకు విమర్శకుల నుంచీ, అభిమానుల నుంచీ ప్రశంసలు దక్కుతూ దానికి కల్ట్ స్టేటస్‌ను తెచ్చాయి. ఈ ఏడాది ఆరంభంలో ఆ సినిమాకు సీక్వెల్ తీస్తాననీ, అందులో ధనుష్ హీరోగా నటిస్తాడనీ ప్రకటించాడు సెల్వరాఘవన్. 2024లో దాన్ని రిలీజ్ చేస్తామని కూడా చెప్పాడు.
ప్రస్తుతం అతను ధనుష్‌తో 'నానే వరువేన్' సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. దాని షూటింగ్ మొదలవుతున్న సమయంలో 'యుగానికి ఒక్కడు' బడ్జెట్ గురించి షాకింగ్ సీక్రెట్ వెల్లడించాడు సెల్వరాఘవన్.
తన ట్విట్టర్ హ్యాండిల్‌లో, "'ఆయిరత్తిల్ ఒరువన్' వాస్తవిక బడ్జెట్ రూ. 18 కోట్లు. కానీ ఒక మెగా బడ్జెట్ ఫిల్మ్‌గా హైప్ క్రియేట్ చేయడానికి రూ. 32 కోట్లతో తీశామని అనౌన్స్ చేయాలని నిర్ణయించాం. వాట్ స్టుపిడిటీ! దాని వాస్తవిక బడ్జెట్‌ను ఆ సినిమా కలెక్ట్ చేసినప్పటికీ, యావరేజ్ ఫిల్మ్‌గా గుర్తింపు పొందింది! అడ్డంకులు ఎలాంటివైనప్పటికీ అబద్ధాలు చెప్పకూడదని నేర్చుకున్నాను!" అని రాసుకొచ్చాడు.

అన్నదమ్ములైన సెల్వ, ధనుష్ కాంబినేషన్‌లో ఇదివరకు 'కాదల్ కొండేన్', 'పుదుపెట్టై', 'మయక్కమ్ ఎన్న' సినిమాలు వచ్చి సూపర్ హిట్టయ్యాయి. ఇప్పుడు వారి ఫ్యాన్స్ 'నానే వరువేన్', 'ఆయిరత్తిల్ ఒరువన్ 2' సినిమాల కోసం కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.
![]() |
![]() |