![]() |
'పాగల్' సినిమా సక్సెస్ కాకపోతే పేరు మార్చుకుంటానని హీరో విష్వక్‌సేన్ ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ఓ పెద్ద ప్రతిజ్ఞ చేశాడు. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని కొత్త దర్శకుడు నరేశ్ కుప్పిలి రూపొందించాడు. బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తే, దిల్ రాజు సమర్పకునిగా వ్యవహరించారు. 'పాగల్' సినిమా ఆగస్ట్ 14న విడుదలైంది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. విమర్శకుల నుంచి ఈ సినిమాకు ప్రశంసలు దక్కలేదు. ఈ నేపథ్యంలో సోమవారం 'పాగల్' ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీట్‌లో 'పాగల్' సినిమా సక్సెస్ అయ్యిందని విష్వక్‌సేన్ చెప్పాడు.
"నేను హీరోగా చేసిన హిట్ సినిమా 'హిట్' కలెక్షన్స్ కంటే 'పాగల్' కలక్షన్స్ 40% ఎక్కువ వచ్చాయి. నాకు, ఆడియన్స్ కి మధ్యలో ఎవరూ లేరు. ఈ సినిమాతో నాకు ఆడియెన్స్ తప్ప ఎవరూ లేరని అర్థం అయింది. నన్ను కాపాడేది మీరు. శని, ఆది వారాలు 6.5 కోట్ల గ్రాస్ కొట్టింది సినిమా. సింగిల్ స్క్రీన్స్ ఊగిపోతున్నాయి.. ఇంతకంటే ప్రూఫ్ ఏమి కావాలి." అంటూ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే క్రిటిక్స్ సినిమాని బాగా క్రిటిసైజ్ చేశారు కాబట్టి.
"సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది, లేకుంటే నేను పేరు మార్చుకుంటా అని చెప్పాను. ఈ సినిమా విడుదల తరువాత చాలా మంది నేను పేరు ఎప్పుడు మార్చుకుంటానా అని చూస్తున్నారు. కానీ ఈ సినిమా హిట్ తో నా నమ్మకం నిజమైంది, నా నమ్మకం వమ్ము కాదని మరోసారి ప్రూవ్ చేసారు ప్రేక్షకులు. ఇప్పుడు నేను పేరు మార్చుకోవలసిన అవసరం లేదు." అని చెప్పేశాడు విష్వక్‌సేన్. సో.. 'పాగల్' బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యిందని రెండు రోజుల కలెక్షన్స్‌తో తీర్మానించేశాడు.
"నేను నమ్మింది ప్రేక్షకులను. వారు నా నమ్మకాన్ని నిజం చేసారు. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా నాకు డైరెక్ట్ సపోర్ట్ చేసింది కేవలం ప్రేక్షకులు మాత్రమే. సినిమా కోసం చాలా మంది నెగిటివ్ గా ప్రమోట్ చేసారు. అయినా సరే నాకు మంచి విజయాన్ని అందించారు ప్రేక్షకులు. సినిమా విషయంలో చాలా మంది రకరకాల కామెంట్స్ చేసారు.. కానీ వారికి సమాధానం ఈ సినిమా విజయం చెప్పింది. నాకు ప్రేక్షకులే తప్ప వెనక గాడ్‌ఫాదర్ లేరు.. నాకు సపోర్ట్ చేసేది మీరే, నన్ను కాపాడేది మీరే. అని ప్రేక్షకులను ఆకాశానికెత్తేస్తూ మాట్లాడాడు 'పాగల్' హీరో. ఏతావాతా తను పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని తేల్చేశాడు.
![]() |