![]() |
![]() |

టాలీవుడ్‌లోని టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా గుర్తింపును ఎంజాయ్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఆయన డైరెక్ట్ చేసిన వాటిలో ఒకట్రెండు మినహా మిగతావన్నీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించినవే. మాటల మాంత్రికుడుగా పేరు పొందిన త్రివిక్రమ్‌కు సంబంధించి ఇటీవలి కాలంలో రెండు అంశాలు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఒకటి.. హీరోయిన్లను రిపీట్ చేయడం, రెండు.. టైటిల్‌ను 'అ' అక్షరంతో ప్రారంభించడం.
'అ ఆ' నుంచి ఆయన వరుసగా 'అ' అక్షరంతోటో తన సినిమాల టైటిల్‌ను ప్రారంభిస్తున్నాడు. 'అరవింద సమేత', 'అజ్ఞాతవాసి', 'అల.. వైకుంఠపురములో'.. ఇలా సాగింది ఆయన సినిమాల లిస్ట్. మధ్యలో 'సన్నాఫ్ సత్యమూర్తి' లేనట్లయితే 'అత్తారింటికి దారేది' నుంచే ఈ పరంపర మొదలయ్యేది. సో.. మహేశ్‌తో ఆయన రూపొందించే #SSMB28 కు కూడా టైటిల్ 'అ' అక్షరంతోనే మొదలవుతుందని ఊహించవచ్చు.
మహేశ్ బర్త్‌డే సందర్భంగా #SSMB28 లో హీరోయిన్‌గా పూజా హెగ్డేని తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అనౌన్స్ చేసింది. దాంతో త్రివిక్రమ్-పూజా హెగ్డేపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. పూజతో త్రివిక్రమ్ పనిచేయడం వరుసగా ఇది మూడోసారి. త్రివిక్రమ్ మునుపటి రెండు సినిమాలు.. 'అరవింద సమేత', 'అల.. వైకుంఠపురములో' చిత్రాల్లో హీరోయిన్ పూజ. ఆ రెండూ పెద్ద హిట్టయ్యాయి. పూజ అందాన్ని గ్లోరిఫై చేసేవిధంగా 'అల.. వైకుంఠపురము'లో సన్నివేశాల్ని కల్పించిన త్రివిక్రమ్.. ఆమె కాళ్ల అందాన్ని పొగుడుతూ "సామజవరగమన" పాటనూ, ఆమె సౌందర్యానికి నీరాజనాలు అర్పిస్తూ "బుట్టబొమ్మ" పాటను రాయించాడు.
హీరోయిన్లను రిపీట్ చేయడం త్రివిక్రమ్‌కు ఇదే తొలిసారి కాదు. పూజ కంటే ముందు సమంత హీరోయిన్‌గా వరుసగా మూడు సినిమాలు.. 'అత్తారింటికి దారేది', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అ ఆ' రూపొందించాడు.
కాగా ఇటు త్రివిక్రమ్‌తో, అటు హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌తో మూడోసారి పనిచేస్తున్నందుకు "రౌండ్ 3" అంటూ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పూజ రాయడం కూడా మీమ్స్‌కు కారణమైంది. మహేశ్‌తో తను కలిసున్న 'మహర్షి' మూవీలోని స్టిల్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన పూజ, మహేశ్‌కు బర్త్‌డే గ్రీటింగ్స్ తెలియజేస్తూ, "హ్యాపీ బర్త్‌డే మహేశ్! మరో బ్లాక్‌బస్టర్‌ను ఆశిస్తున్నాను. మరింత ముఖ్యంగా సెట్స్‌పై ఫన్‌ను ఆశిస్తున్నా. ఈ సంవత్సరం ఎక్కువ ప్రేమ, నవ్వు, విజయం లభిస్తాయని ఆశిస్తున్నా. సినిమాలో నటిస్తున్నందుకు హ్యాపీ. త్రివిక్రమ్ సార్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్.. రౌండ్ 3.. లెట్స్ గో!" అంటూ రాసుకొచ్చింది. దాంతో "రౌండ్ 3 అంట" అని మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.


![]() |
![]() |