![]() |
![]() |
.jpg)
మలయాళం నటి శరణ్య శశి త్రివేండ్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆగస్ట్ 9న తుదిశ్వాస విడిచారు. పదేళ్ల క్రితం ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. అప్పట్నుంచి ఇంతవరకూ 11 పెద్ద సర్జరీలు చేశారు. కొన్ని వారాల క్రితం కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అవడం ఆమె ఆరోగ్య స్థితిని మరింత దిగజార్చింది. దాని నుంచి ఆమె బయటపడినప్పటికీ, ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతూ వచ్చారు.
మలయాళం టీవీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో శరణ్య శశి పాపులర్ నటి. 2012 నుంచి ఆమె బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాటం చేస్తున్నారు. ఇటీవల కొవిడ్ నుంచి కోలుకున్న ఆమె న్యుమోనియా, రక్తంలో సోడియం లెవల్స్ పడిపోయిన కారణంగా తీవ్ర అస్వస్థతకు గురవడంతో త్రివేండ్రంలోని ఓ హాస్పిటల్‌లో చేరారు. నిన్న అదే హాస్పిటల్‌లో ఆమె మృతి చెందారు.
బ్రెయిన్‌లో ట్యూమర్ ఉన్నట్లు గుర్తించిన దగ్గర్నుంచీ శరణ్య తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు. చికిత్స కోసం, ఇతర ఖర్చుల నిమిత్తం ఇండస్ట్రీలోని పలువురు ఆమెకు ఆర్థిక సాయం అందించారు. వారిలో ఆమె సహనటి, స్నేహితురాలు సీమా జి. నాయర్ ప్రముఖురాలు. ఆర్థికంగానే కాకుండా, మానసికంగా కూడా శరణ్యకు సీమ ధైర్యాన్నిచ్చారు. శరణ్య కోసం ఓ ఇంటిని కూడా కట్టించిన సీమ, ఆమెతో గృహప్రవేశం కూడా చేయించారు.
'చాకో రండమన్' సినిమాతో తెరంగేట్రం చేసిన శరణ్య శశి.. చొట్ట ముంబై, తలప్పవు, బాంబే తదితర చిత్రాల్లో నటించారు. మంత్రోడి, హరిచందనం, సీత లాంటి పాపులర్ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు పొందారు.
![]() |
![]() |