![]() |
![]() |

'మా' ఎన్నికలపై, తనపై నటి హేమ చేసిన వ్యాఖ్యలను మా అధ్యక్షుడు నరేశ్ ఖండించారు. 'మా' నిధుల్ని తాను మొత్తంగా ఖర్చుపెట్టేస్తున్నానంటూ ఆమె చేసిన ఆరోపణను ఆయన తప్పుపట్టారు. 'మా' మెంబర్స్‌కు పంపిన వాయిస్ మెసేజ్‌లో ఆమె మాటలు 'మా' గౌరవాన్ని దెబ్బతీసేవిధంగా ఉన్నాయన్నారు. ఆమె వ్యాఖ్యలపై మా క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేస్తామని, ఆ కమిటీ తీసుకునే నిర్ణయం మేరకు ఆమెపై చర్యలు తీసుకుంటామనీ అన్నారు. కరోనా వ్యాప్తి కారణంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మా ఎన్నికలకు సంబంధించి సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత, పరిస్థితులకు అనుగుణంగా మా ఎన్నికలు జరుగుతాయని నరేశ్ స్పష్టం చేశారు.
"'మా' ప్రతిష్ఠను దృష్టిలో పెట్టుకొని, మా సభ్యుల్లో సందేహాలు సృష్టించి, కరోనా టైమ్‌లో ఎన్నికల కోసం పాకులాడుతూ ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వడాన్ని మేం ఖండిస్తున్నాం. రెండు రోజులుగా జరిగిన పరిణామాలను, మా సభ్యుల డిస్ట్రబ్ అవుతున్న పరిస్థితుల్ని క్రమశిక్షణ కమిటీకి పంపిస్తున్నాం." అని ఆయన చెప్పారు. వాయిస్ మెసేజ్‌లో హేమ వ్యాఖ్యలు తమను షాక్‌కు గురిచేశాయన్నారు. "మా నిధుల్ని తాము దుర్వినియోగం చేస్తున్నామనో, వాడేస్తున్నామనో, మా మొత్తం దివాళా తీస్తుందన్నట్లుగా ఒక భయానకమైన మెసేజ్‌ను ఆమె ఇచ్చారు. మాకెవరికీ పదవీ వ్యామోహాలు లేవు. కరోనా టైమ్‌లో ఎలక్షన్స్ పెడితే మామీద మర్డర్ చార్జెస్ వచ్చే అవకాశం ఉంది. దానికి నేను, జీవిత బాధ్యత వహించాల్సి వస్తుంది. ఫండ్స్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లు మాట్లాడిన మాటలు మనసుకు బాగా కష్టమనిపించాయి. 'మా'కు మా అమ్మ (విజయనిర్మల) 30 లక్షలు ఇచ్చారు. ప్రతి నెలా నేను 20 వేలు ఇస్తున్నాను. జీవిత 10 లక్షలు ఇచ్చారు. నిధుల్ని మేం తినేస్తున్నాం అనేది మాకు చాలా డామేజింగ్ మాట. ఆమె చేసిన బాధ్యతారహితమైన వ్యాఖ్యలు బైలాస్‌లో ఉన్న సెక్షన్ 8 ప్రకారం క్రమశిక్షణా చర్యకు తావుతీస్తుంది" అని చెప్పారు. ఎన్నికల గురించి ఆగస్ట్ 22న జరిగే జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
'మా'లో ఎలాంటి అన్యాయాలు, మోసాలు జరగడం లేదు
హేమ వ్యాఖ్యలు చాలా తప్పుగా అనిపించాయని జీవితా రాజశేఖర్ సైతం అభిప్రాయపడ్డారు. తాము వివరణ ఇవ్వకుండా హేమ ఆరోపణలే నిజమనుకుంటారనీ, సమావేశంలో అందరం కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామనీ తెలిపారు. హేమ మీడియా ముందుకు వెళ్లడం సరికాదని ఆమె అన్నారు. మా ఎన్నికలకు సంబంధించి మీడియాకు ఎక్కవద్దని, మీడియాతో మాట్లాడవద్దని, మనమధ్య ఉన్న విషయాల్ని మనమే పరిష్కరించుకుందామని అనుకున్నామన్నారు.
"ఇది ప్రజలకు అవసరంలేని సమస్య. ఇది ఇండియా-పాకిస్తాన్, ఇండియా-చైనా సమస్య కాదు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు సంబంధించిన ఒక సమస్య." అని ఆమె అన్నారు. "నరేశ్‌గారు ప్రెసిడెంట్‌గా ఉండిపోవాలని పాకులాడ్డం లేదు. ఒక టర్మ్ మాత్రమే తాను అధ్యక్షునిగా ఉంటానని, రెండోసారి పోటీచేయనని ముందుగానే చెప్పారు. అలాగే ఉన్నారు. అందరం ఒక అండర్‌స్టాండింగ్‌తో కూర్చొని మాట్లాడుకున్న తర్వాత హేమ ఇలా మీడియాకు ఎక్కడం చాలా తప్పు. అసలు ఎలక్షన్స్ ఎవరు పెట్టమంటున్నారు? మెంబర్స్‌కు కన్‌ఫ్యూజన్ దేనికి? ఫండ్స్ మొత్తం ఖర్చు పెట్టేస్తున్నారని నరేశ్‌గారిని ఉద్దేశించి అన్నప్పటికీ ఆఫీస్‌ను నడుపుతోంది జనరల్ సెక్రటరీగా నేను కాబట్టి, నన్ను కూడా అన్నట్లే. వచ్చే ఏడాది కల్లా మా కార్పస్ ఫండ్ మొత్తం ఖాళీ అయిపోతుందని హేమ ఆరోపించారు. నిజానికి ఇప్పుడు కార్పస్ ఫండ్ రూ. 4.6 కోట్ల దాకా ఉంది. మెడిక్లెయిమ్ ఎవరికిస్తున్నాం.. మెంబర్ సంక్షేమం కోసమే కదా. ఎందుకు సభ్యులకు తప్పుడు సమాచారం ఇవ్వడం?" అని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి వాటివల్ల సభ్యుల్లో అభద్రతా భావం సృష్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 'మా'లో ఎలాంటి అన్యాయాలు, ఎలాంటి మోసాలు జరగడం లేదు. అందరూ భద్రతతో ఉన్నారనీ. ఇందులోని ప్రతి పైసాను సభ్యుల సంక్షేమం కోసమే వినియోగిస్తున్నారనీ ఆమె స్పష్టం చేశారు.
![]() |
![]() |