![]() |
![]() |

దేశవ్యాప్తంగా.. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. 'బాహుబలి' సిరీస్ తర్వాత యస్.యస్. రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో సహజంగానే అందరిలోనూ విపరీతమైన కుతూహలాన్ని రేకెత్తి స్తున్న ఫిల్మ్. పైగా టాలీవుడ్‌లో సమాన ఇమేజ్ వున్న ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ తొలిసారి కలిసి నటిస్తోన్న సినిమా కావడం దీనిపై అంచనాల్ని అంబరాన్ని చుంబించేలా చేస్తున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉక్రెయిన్ దేశంలో జరుగుతోంది. అక్కడ చిత్రీకరించే సన్నివేశాలతో షూటింగ్ పూర్తి కానున్నది. అక్కడ తారక్, చరణ్, ఒలీవియో మోరిస్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఫస్ట్ టైమ్ తాను ఓ సినిమా షూటింగ్‌లో ఐడీ కార్డును ఉపయోగిస్తున్నానని రీసెంట్‌గా తారక్ వెల్లడించాడు. కాగా షాట్ గ్యాప్‌లో లభించిన సమయాన్ని హీరోలిద్దరూ సరదాగా చాటింగ్‌లతో గడుపుతున్నట్లు ఇటీవల మూవీ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఓ వీడియో ద్వారా తెలిపారు.
అయితే ఈ వీడియో ఇప్పుడు తారక్ ఫ్యాన్స్‌లో సందేహాలను రేకెత్తించింది. ఆ వీడియోలో తారక్ నుదుటి పక్కన ఎడమవైపు గాయం అయినట్లు పోడవాటి చార కనిపిస్తోంది. అది గమనించిన ఫ్యాన్స్ తమ హీరోకు ఏమైందంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. దాంతో చిత్ర బృందం స్పందించక తప్పలేదు. తారక్ ఏమీ కాలేదని చెప్పకుండా, "అది మేకప్" అంటూ బ్రహ్మానందం "ష్" అంటున్నట్లు పోజిచ్చిన వీడియో మీమ్‌ను షేర్ చేసింది. మునుపటి వీడియో షేర్ చేయడం వల్ల వచ్చిన తిప్పలు ఇవి అన్నట్లు చిత్ర బృందం నిట్టూర్చిందన్న మాట.

అక్టోబర్ 13న 'ఆర్ఆర్ఆర్' మూవీని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఓ వైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా జరుగుతున్నాయి.
![]() |
![]() |