![]() |
![]() |

'ఆర్య' సినిమాలో "అ అంటే అమలాపురం.. ఇ అంటే ఇచ్ఛాపురం" సాంగ్ ఏంత పాపులర్ అయ్యిందో, ఆ సాంగ్‌లో డాన్స్ చేసిన అభినయశ్రీ కూడా అంతగానూ పాపులర్ అయ్యింది. ఆ పాట ఆమెకు అనేక అవకాశాలు తీసుకొచ్చింది. అప్పుడామె వయసు కేవలం పదిహేనేళ్లు. ఆమె.. నిన్నటి తరం ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ అనూరాధ కుమార్తె. నిజానికి "అ అంటే అమలాపురం" పాటను అభినయశ్రీతో చేయడం డైరెక్టర్ సుకుమార్‌కు ఇష్టం లేదు. ఆయన ఆ పాటను ఓ పేరున్న హీరోయిన్‌తో చేయించాలని అనుకున్నారు. ఆయన ఫస్ట్ చాయిస్ సిమ్రాన్. లేదంటే సాక్షి శివానంద్‌తో చేయించాలనుకున్నారు. అలాంటిది అభినయశ్రీ ఆ పాటను చేయడం వెనుక ఓ కథ ఉంది.
నవదీప్‌ను హీరోగా పరిచయం చేస్తూ తేజ తీసిన 'జై' మూవీలో అభినయశ్రీ నటించింది. కొరియోగ్రాఫర్ శంకర్ ఆధ్వర్యంలో ఓ పాట చిత్రీకరణ జరుగుతున్నప్పుడు తేజతో మాట్లాడాలని నిర్మాత దిల్ రాజు ఆ సెట్స్‌కు వచ్చారు. అక్కడ అభినయశ్రీని చూసి, "ఈ అమ్మాయి మన సినిమాలో ట్రైన్ సాంగ్‌కు బాగా పనికొస్తుంది." అని శంకర్‌తో అన్నారు. శంకర్ కూడా అది మంచి ఐడియా అని చెప్పారు. ఆ వెంటనే అభినయశ్రీతో "నువ్వు మా 'ఆర్య'లో పాట చేస్తున్నావ్" అని చెప్పి వెళ్లిపోయారు దిల్ రాజు.
'ఆర్య' యూనిట్ ఒరిసాలో ఉంది. అక్కడకు అభినయశ్రీని రప్పించారు. ఆమెను రప్పించిన విషయాన్ని సుకుమార్‌కు చెప్పారు. అయితే సుకుమార్, "నాకు కొత్తమ్మాయి వద్దు. ప్రేక్షకులకు బాగా తెలిసిన గ్లామరస్ హీరోయిన్ కావాలి." అని చెప్పారు. దిల్ రాజు, శంకర్ కలిసి ఆయనను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. "ఒక ఆర్టిస్టును ఇంతదూరం తీసుకువచ్చి ఆ అమ్మాయి ఎలా డాన్స్ చేస్తుంది, ఎలా ఉంటుందని కూడా చూడకుండా అలా ఎలా చెప్తారు? రేప్పొద్దున ఒక్క షాట్ చేయనిద్దాం. మీకు నచ్చితే ఆమెతో సాంగ్ చేద్దాం, లేదంటే పంపించేద్దాం" అని చెప్పారు. సరేనన్నారు సుకుమార్.
6 గంటలకు ఒరిసా నుంచి ట్రైన్ వెళ్లిపోతుంది. అందుకని 3 గంటలకు లేచి, మేకప్ వేసుకొని, ఎలాగైనా సుకుమార్‌ను మెప్పించాలనే పట్టుదలతో స్టేషన్‌కు వెళ్లింది అభినయశ్రీ. ట్రైన్‌లో ఫస్ట్ షాట్ పెట్టారు. ఆయన వచ్చి నిల్చొని చూస్తున్నారు. ఆయనే డైరెక్టర్ అని అభినయశ్రీకి తెలీదు. ఎందుకంటే సుకుమార్‌కు అదే ఫస్ట్ ఫిల్మ్ కదా! కొరియోగ్రాఫర్ శంకర్ టేక్ చెప్పారు. అభినయశ్రీ చేసింది. శంకర్ వెళ్లి "ఏంటి సార్ ఎలా ఉంది?" అనడిగారు సుకుమార్‌ను. "ఆ అమ్మాయినే పెట్టి పాట చేసుకోండి." అని చెప్పి వెళ్లిపోయారు సుకుమార్. ఆ సాంగ్ కంప్లీట్ అయిపోయింది.
'ఆర్య' సినిమా రిలీజై, "అ అంటే అమలాపురం" పాట ఆడియెన్స్‌ను అమితంగా అలరించింది. అప్పుడు ఎక్కడ చూసినా ఆ పాటే. సినిమా రిలీజైన 25 రోజుల తర్వాత ఒక ఫంక్షన్‌లో సుకుమార్‌ను కలిసింది అభినయశ్రీ. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి, "నువ్వు బాగా చేశావ్. నీ వల్లే ఆ పాట బాగా వచ్చింది" అని ప్రశంసించారు.
![]() |
![]() |