![]() |
![]() |

తెలుగుతెరపై ఆవిష్కృతమైన అద్భుతాల్లో 'ఆదిత్య 369' చిత్రం ఒకటి. ప్రయోగాలకు పెట్టింది పేరైన నందమూరి కుటుంబం నుంచి వచ్చిన ఈ సెన్స్ ఫిక్షన్ మూవీ.. భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందిన తొలి టైమ్ ట్రావెల్ మూవీగా రికార్డులకెక్కింది. వర్తమాన, భూత, భవిష్యత్ కాలాల్లో ప్రేక్షకులను విహరింపజేసిన ఈ టైమ్‌లెస్ క్లాసిక్‌లో నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించగా.. వెర్సటైల్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు రూపకల్పన చేశారు.
ప్రొఫెసర్ రామదాసు (టిన్నూ ఆనంద్) తన హోమ్ ల్యాబ్‌లో 'ఆదిత్య 369' అనే ఓ టైమ్ మిషన్‌ని ఆవిష్కరిస్తాడు. కొంతమంది పిల్లలు చేసిన పొరపాటు వల్ల.. అనూహ్య పరిస్థితుల్లో రామదాసు కుమార్తె హేమ (మోహిని), ఆమె ప్రియుడు కృష్ణ కుమార్ (బాలకృష్ణ), ఓ పోలీస్ (సుత్తి వేలు) ఆ టైమ్ మిషన్ ద్వారా గతంలోకి, భవిష్యత్ లోకి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఆసక్తికరమైన సన్నివేశాల సమాహారమే 'ఆదిత్య 369' చిత్రం.
ఇందులో బాలకృష్ణ కథానుసారం ఆధునిక యువకుడు కృష్ణ కుమార్ గానూ, చరిత్ర పురుషుడు శ్రీకృష్ణదేవరాయలు గానూ రెండు విభిన్న పాత్రల్లో అలరించారు. తన తండ్రి, మహానటుడు నందమూరి తారక రామారావు పోషించి మెప్పించిన శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో తన శైలి అభినయంతో ఆకట్టుకున్నారాయన. తన తరంలో తను తప్ప మరెవ్వరూ ఆ వేషానికి రక్తి కట్టించలేరన్నంతగా ఒదిగిపోయారు బాలయ్య.
సిల్క్ స్మిత, కిన్నెర, ఆమ్రిష్ పురి, చంద్రమోహన్, జేవీ సోమయాజులు, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, రావి కొండలరావు, గొల్లపూడి, భరణి, బాబూమోహన్, అన్నపూర్ణ, శ్రీలక్ష్మి, మాస్టర్ తరుణ్, బేబి విజయ (రాశి) ఇతర ముఖ్య పాత్రల్లో అలరించిన ఈ సినిమాకి వి.ఎస్.ఆర్. స్వామి, కబీర్ లాల్ అందించిన ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
.jpg)
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. "జాణవులే", "రాసలీల వేళ", "సెంచరీలు కొట్టే" గీతాలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక ఇళయరాజా నేపథ్యసంగీతం సరేసరి. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన 'ఆదిత్య 369'.. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్ విభాగాల్లో 'నంది' పురస్కారాలను అందుకుంది. 1991 జూలై 18న విడుదలై జననీరాజనాలు అందుకున్న 'ఆదిత్య 369'.. నేటితో 30 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |