![]() |
![]() |

ఇంగ్లండ్ నుంచి 2012లో తను తెప్పించుకున్న 'రోల్స్ రాయిస్ ఘోస్ట్' కారుకు ఎంట్రీ టాక్స్ మినహాయింపు ఇవ్వాల్సిందిగా తమిళ స్టార్ విజయ్ పెట్టుకున్న పిటిషన్‌ను ఇటీవల మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు, ఎంట్రీ టాక్స్ కట్టడంతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి పబ్లిక్ రిలీఫ్ ఫండ్‌కు రూ. 1 లక్ష జరిమానా చెల్లించాల్సిందిగా కూడా కోర్టు ఆదేశించింది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతూ వస్తున్నాయి.
విజయ్ తెరమీదే కాదు, నిజ జీవితంలోనూ హీరోగా వ్యవహరించాలని పలువురు విమర్శిస్తున్నారు. కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకొనే విజయ్ తను ఇంపోర్ట్ చేసుకున్న కారుకు ఎంట్రీ టాక్స్ మినహాయింపు కోరుతూ పిటిషన్ పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే చాలామందికి తెలీని విషయం.. ఇంపోర్ట్, ఇతర టాక్సుల రూపేణా ఆ కారుకు ఇప్పటికే విజయ్ రూ. 1,88,11,045 చెల్లించాడు!
సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై వివాదం తలెత్తడం, మద్రాస్ హైకోర్ట్ చేసిన వ్యాఖ్యలు విజయ్ వ్యక్తిగత ప్రతిష్ఠపై ప్రభావం చూపడంతో, ఆ వ్యాఖ్యలపై కౌంటర్ దాఖలు చేయాలని విజయ్ నిర్ణయించుకున్నాడు. ఈ కౌంటర్ ఎంట్రీ టాక్స్‌కు సంబంధించింది కాదని విజయ్ లాయర్ ఎస్. కుమరేశన్ తెలిపారు. "హైకోర్టు తమ తీర్పులో విజయ్ గురించి ప్రస్తావించిన కొన్ని అంశాలపైనే మేం అప్పీలుకు వెళ్తున్నాం." అని ఆయన స్పష్టం చేశారు.
అఫిడవిట్‌లో విజయ్ ఆఖరుకి తన ప్రొఫెషన్ ఏమిటో కూడా ప్రస్తావించలేదని హైకోర్టు న్యాయమూర్తి విమర్శించారు. "ఆయన ఇంగ్లండ్ నుంచి ప్రతిష్ఠాత్మక ఖరీదైన కారును దిగుమతి చేసుకున్నారు కానీ, దురదృష్టవశాత్తూ చట్టప్రకారం ఎంట్రీ టాక్స్‌ను చెల్లించలేదు. పన్ను చెల్లించకుండా ఉండటానికి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పేరుపొందిన సినీ యాక్టర్ అయిన పిటిషనర్ వెంటనే పన్ను చెల్లిస్తారని భావిస్తున్నాం." అని జడ్జి తన తీర్పులో వ్యాఖ్యానించారు.
![]() |
![]() |