![]() |
![]() |

లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తివేసి, 50 శాతం సామర్థ్యంతో నడుపుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇంతదాకా తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సినిమా థియేటర్ కూడా ఓపెన్ కాలేదు. తెలంగాణ ప్రభుత్వంపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అసంతృప్తిగా ఉండటమే దీనికి కారణం. ఎలక్ట్రిసిటీ బిల్స్, ప్రాపర్టీ టాక్స్‌ను మాఫీ చెయ్యడం, జీఎస్టీని తగ్గించడం, టిక్కెట్ ధరలు, షోల సంఖ్య విషయంలో ఫ్లెక్సిబిలిటీ లాంటి పలు అంశాలను పరిష్కరించాల్సిందిగా వారు కోరుతున్నారు. ఈ సమస్యలు పరిష్కారమయ్యే దాకా అక్టోబర్ వరకు సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయొద్దని కూడా నిర్మాతలను ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. రెండు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ చేసేదాకా వేచి చూడమని చెబుతున్నారు.
"ప్రస్తుతం మేం చాలా సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నాం. సినీ రంగానికి చెందినవారంతో కలిసికట్టుగా ఉండి, సమస్య పరిష్కారం కోసం కృషి చెయ్యాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతున్నాం. అక్టోబర్ దాకా సినిమాలను ఓటీటీలో నేరుగా రిలీజ్ చేయవద్దని నిర్మాతలను కోరుతున్నాం. మా డిమాండ్లు పరిష్కారమవుతాయనే నమ్మకంతో ఉన్నాం." అని చెప్పారు తెలంగాణ ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ సునీల్ నారంగ్. స్వయంగా నిర్మాత అయిన ఆయన నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరి'ని నిర్మించారు. ఆ సినిమాకు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నుంచి ఆఫర్లు వచ్చినా, థియేటర్లలో రిలీజ్ చెయ్యాలనే సంకల్పానికి ఆయన కట్టుబడి ఉన్నారు.
అయితే పెద్ద సినిమాలకైతే ఫర్వాలేదు కానీ, తమలాంటి వారికి మరింత కాలం థియేటర్ల కోసం ఎదురుచూడ్డం వల్ల నష్టం కలుగుతుందని చిన్న సినిమాల నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే 2020 నుంచి అనేక సినిమాలు విడుదల కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని నెలలపాటు తమ సినిమాలను థియేటర్ల కోసం ఆపుకోవడం కష్టమనీ, ఒకవేళ థియేటర్లు తెరిచినా ఏకకాలంలో అనేక సినిమాలు రిలీజ్ చేయడం వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదని పలువురు నిర్మాతలు భావిస్తున్నారు. ఇదివరకు జనవరి నుంచి మార్చి మధ్య ఇదే తరహాలో ఒకేవారం ఏడెనిమిది చిన్న సినిమాలు రిలీజై, దేనికీ ప్రయోజనం కలగకుండా పోయిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అందుకే థియేటర్లలో రిలీజ్ గురించి ఎదురుచూడకుండా, గిట్టుబాటయ్యే ధర వస్తే ఓటీటీకి వెళ్లాలని వారు చూస్తున్నారు.
ఎగ్జిబిటర్ల అభ్యర్థనలు ఎలా ఉన్నప్పటికీ పలువురు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా వ్యాపారంలో ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పడానికి లేదని 'నారప్ప' సినిమా ప్రొడ్యూసర్ డి. సురేశ్‌బాబు అంటారు. "కొంత కాలం నుంచి థియేటర్లు మూతపడి ఉండటం వల్ల నష్టాల్లో మునిగిపోయిన ఎగ్జిబిటర్లు తమ థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు. నిర్మాతల కష్టాలు నిర్మాతలవి. అందువల్ల ఎవరి వెసులుబాటును బట్టి వారు నిర్ణయాలు తీసుకుంటారు. ఇది సంక్షోభ కాలం. త్వరలో పరిస్థితులు కుదుటపడతాయని ఆశిస్తున్నాం." అని ఆయన చెప్పారు. అక్టోబర్ వరకు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయకుండా ఆపాలని ఫిల్మ్‌చాంబర్ నిర్మాతలను కోరడానికి చాలా ముందుగానే 'నారప్ప'ను ఓటీటీలో రిలీజ్ చేయాలని సురేశ్‌బాబు డీల్ కుదుర్చుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ రానట్లయితే ఆ సినిమా మే నెలలోనే థియేటర్లలో విడుదలవ్వాల్సింది.
ఎగ్జిబిటర్ల డిమాండ్లు ఇవీ..
థియేటర్లు మూతపడిన కాలానికి ఎలక్ట్రిసిటీ బిల్లులను మాఫీ చేయాలి.
2020, 2021 సంవత్సరాలకు థియేటర్లకు ప్రాపర్టీ టాక్స్‌ను మినహాయించాలి.
థియేటర్లలో పార్కింగ్‌కు కనీస చార్జీలనైనా అనుమతించాలి.
ప్రస్తుతం ఉన్న 28 శాతం జీఎస్టీ శ్లాబ్‌ను తగ్గించాలి.
టిక్కెట్ ధరలను నిర్ణయించుకొనే వెసులుబాటు థియేటర్లకు ఇవ్వాలి.
![]() |
![]() |