![]() |
![]() |

తల్లి ఎవరో, తండ్రి ఎవరో తెలియనివాణ్ణి `బ్రహ్మపుత్రుడు` అని పిలుస్తుంటారు. అలాంటి ఓ యువకుడి కథతో తెరకెక్కిన ఎమోషనల్ యాక్షన్ డ్రామానే `బ్రహ్మపుత్రుడు`. విక్టరీ వెంకటేశ్ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాని దర్శకరత్న దాసరి నారాయణరావు రూపొందించారు. వెంకీ, దాసరి కాంబినేషన్ లో రూపొందిన తొలి చిత్రమిదే కావడం విశేషం. వెంకటేశ్ కి జంటగా రజిని నటించిన ఈ చిత్రంలో జయసుధ, మోహన్ బాబు, శ్రీవిద్య, బేబి షాలిని, నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య, వేలు, బ్రహ్మానందం, వై. విజయ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. తమిళ చిత్రం `మైఖేల్ రాజ్` (రఘువరన్, మాధురి, శరత్ బాబు, బేబి షాలిని)కి రీమేక్ గా `బ్రహ్మపుత్రుడు`ని తెరకెక్కించారు.
దిగ్గజ స్వరకర్త చక్రవర్తి బాణీలు అందించిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి, దాసరి సాహిత్యమందించారు. దాసరి నారాయణరావు సంభాషణలు సమకూర్చిన ఈ సినిమాకి పి.యస్. ప్రకాశ్ ఛాయాగ్రహణం అందించారు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించిన `బ్రహ్మపుత్రుడు`.. 1988 జూలై 1న జనం ముందు నిలిచింది. నేటితో ఈ బ్లాక్ బస్టర్ మూవీ 33 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |