![]() |
![]() |

మహేశ్ నారాయణన్ డైరెక్షన్‌లో ఫహద్ ఫాజిల్ మెయిల్ రోల్ చేసిన 'మాలిక్' మూవీ జూలై 15న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతోంది. నిజానికి ఈ చిత్రం మే 13న థియేటర్లలో విడుదల కావాల్సింది. కానీ కరోనా మహమ్మారి రెండో వేవ్ కారణంగా వాయిదాపడింది. ఫహద్ ఫాజిల్‌తో పాటు ఈ సినిమాలో నిమిషా సజయన్, జోజు జార్జ్, వినయ్ ఫోర్ట్, దిలీప్ పోతన్, జలజ కీలక పాత్రలు పోషించారు.
ఇప్పుడు వెలుగు చూడడానికి ముందు ఏడాది పాటు ఈ సినిమా అలమరాల్లో పడుకొని ఉంది. మొదట 2020 మధ్యలో మాలిక్‌ను రిలీజ్ చేయాలనుకున్నారు. అప్పుడు కొవిడ్-19 మహమ్మారి మొదటి వేవ్ కారణంగా పోస్ట్‌పోన్ అయింది. దేశవ్యాప్తంగా థియేటర్లు ఇంకా మూతపడే ఉన్నందున ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోకు స్ట్రీమింగ్ హక్కుల్ని విక్రయించాలని నిర్మాత ఆంటో జోసెఫ్ నిర్ణయించుకున్నారు.
'మాలిక్' కొత్త పోస్టర్‌ను షేర్ చేస్తూ, తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో, "fafa is our maseeha. Meet #MalikOnPrime July 15 (sic)." అని రాసుకొచ్చింది.
'మాలిక్' షూటింగ్ 2020 మొదట్లో పూర్తయింది. చాలా కాలం ఎదురుచూశాక, ఎట్టకేలకు ఈ సినిమా జూలై 15న వెలుగు చూస్తోంది. ఫహద్ ఫాజిల్ పోషించిన సులేమాన్ మాలిక్ అనే వ్యక్తి జీవితం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. అధికార శక్తులకు వ్యతిరేకంగా విప్లవాన్ని లేవదీసే ఆకర్షణీయ లీడర్‌గా మాలిక్ పాత్ర కనిపిస్తుంది. డైరెక్టర్ మహేశ్ నారాయణన్ ఈ సినిమాకు ఎడిటర్‌గానూ వర్క్ చేశాడు.
![]() |
![]() |