![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. ఇప్పటికే మా అధ్యక్ష బరిలో నలుగురు నిలిచారు. అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ ప్రకటించారు. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీవీఎల్ నరసింహారావు ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలో తలపడనున్నట్లు ప్రకటించారు.
'మా' ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సీవీఎల్ నరసింహారావు తెలిపారు. తన ప్యానల్ తెలంగాణ వాదమని, సినిమా అవకాశాల్లో తెలుగు వారికి న్యాయం జరగాలని అన్నారు. తెలంగాణ కళాకారులు, వాళ్ల ఇబ్బందులే తన ఎజెండా అన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ కి చెందిన పేద, మధ్య తరగతి కళాకారులకూ సరైన అవకాశాలు దక్కడం లేదని వాపోయారు. ఎప్పుడో పదేళ్ళ క్రితం పరభాషా నటుల విషయంలో 'మా' అసోసియేషన్ ఏకగ్రీవంగా ఓ తీర్మానం చేసుకుందని, కానీ దానిని ఎవ్వరూ పాటించడం లేదని అన్నారు. దాన్ని తుంగలోకి తొక్కడం వల్ల చాలామంది తెలుగు కళాకారులకు అన్యాయం జరుగుతోందన్నారు.
రాష్ట్ర తర్వాత 'మా'లోనూ రెండు విభాగాలను ఏర్పాటు చేసి విడివిడిగా ఎన్నికలు జరపాల్సిందని, కానీ అలా జరగలేదన్నారు. ఇప్పటికిప్పుడు విభజన కుదరదు కాబట్టి.. ఈసారి జరిగే 'మా' ఎన్నికల్లో 18 మంది కార్యవర్గ సభ్యుల్లో తెలంగాణ వారికి కనీసం 9.. అలానే రెండు ఉపాధ్యక్ష, రెండు సంయుక్త కార్యదర్శుల పదవుల్లో ఒక్కొక్కటి తెలంగాణ వారికి కేటాయించాలని.. జనరల్ సెక్రటరీ లేదా ట్రెజరర్ గా తెలంగాణ వారిని నియమించాలని ఆయన కోరారు. తెలుగు సినీ పరిశ్రమ, అలాగే తెలంగాణ సినీ పరిశ్రమను కూడా బతికించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని అన్నారు. ఎన్నికల తేదీని ప్రకటించే సమయానికి తన ప్యానెల్ ను ఏర్పాటు చేస్తానని సీవీఎల్ తెలిపారు.
'మా' అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన సీవీఎల్ నరసింహారావుకు నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి మద్దతు తెలిపారు. 'మా' సభ్యురాలిని కాకున్నా ఒక కళాకారిణిగా ఈ అంశంపై స్పందిస్తున్నానన్నారు. 'మా' ఎన్నికల పై సీవీయల్ నరసింహా రావు అవేదన న్యాయమైనది, ధర్మమైనదని.. చిన్న కళాకారుల సంక్షేమం దృష్టా సీవీయల్ అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్నానని వ్యాఖ్యానించారు.
![]() |
![]() |