![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో 150కి పైగా చిత్రాల్లో నటించారు. వాటిలో స్టార్ హీరో కాకముందు భిన్న తరహా పాత్రలతో మెప్పించిన ఆయన, స్టార్ హీరో అయ్యాక ఎక్కువగా మాస్‌ను మెప్పించే పాత్రలు, సినిమాలనే చేశారు. అడపాదడపా 'స్వయంకృషి', 'ఆరాధన' లాంటి సినిమాల్లో డీగ్లామరస్ రోల్స్, 'చంటబ్బాయ్' లాంటి సినిమాలో కామెడీ రోల్ కూడా చేసి మెప్పించారు. అయితే 'ఆరాధన', 'చంటబ్బాయ్' లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అపజయం పొందడం ఆయనకు ఒకింత బాధ కలిగించింది.
"నేను ఇంతవరకూ నటించిన చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలనే పోషించాను. అయితే వాటిలో కొన్ని చిత్రాలలో నేను పోషించిన పాత్రలు ఎంత మంచివైనా, ఉన్నతమైనవైనా చిత్రం ఆర్థకింగా పరాజయం పొందడంతో వాటికి గుర్తింపు లేకపోయింది. అది ఒక విధంగా దురదృష్టకరం. అయితే ఏదైనా ఒక సినిమా పరాజయం పొందినంత మాత్రాన పాత్రల లోపమో, పాత్రపోషణ లోపమో, లేదా ఆ పాత్రను తీర్చిదిద్దిడంలో లోపమో అని నేననను. కానీ చిత్రం మొత్తం మీద ఏదో మిస్సయింది. ఆ టైపు కథల్ని సరిగ్గా రిసీవ్ చేసుకొనే పరిస్థితిలో ప్రేక్షకులు లేకపోవడమో, లేక వారిని సరిగా కన్విన్స్ చేయలేకపోవడమో కావచ్చు. లేదా.. బాగా పెరిగిన నా ఇమేజ్ వల్ల అట్లాంటి పాత్రల్లో ప్రేక్షకులు నన్ను అంగీకరించకపోవడమైనా కారణం కావచ్చు." అని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు చిరంజీవి.
అలా అని ఇమేజ్ అనే షెల్‌లో బిగుసుకుపోవాలనే అభిమతం తనకు లేదని ఆయన తేల్చేశారు. "చిరంజీవి ఎలాంటి పాత్రనైనా పోషించి మెప్పించగలడు. చిరంజీవి ఆల్‌రౌండర్ అని అందరిచేతా ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందాలనే తపన నాలో ఎంతైనా ఉంది. ఆ మేరకు నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నాల్లో నేను కొన్ని పరాజయాలు పొందినా, నేను పోషించే పాత్రల్లో నన్ను అంగీకరించి మెచ్చుకొనే స్థాయికి ప్రేక్షకులను తీసుకురావడానికి నా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను." అని ఆ సినిమాలు ఎందుకు చేశారో ఆయన వెల్లడించారు.
![]() |
![]() |