![]() |
![]() |

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. తన అభిమాన రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి రచించిన ప్రసిద్ధ నవల `మీనా` ఆధారంగా త్రివిక్రమ్ రూపొందించిన `అ ఆ` (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) కూడా ఇదే తరహా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనరే. టైటిల్ రోల్స్ లో సమంత, నితిన్ నటించిన ఈ చిత్రంతోనే కేరళకుట్టి అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నదియా, నరేశ్, అనన్య, రావు రమేశ్, అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు, హరితేజ, అజయ్, జయప్రకాశ్, పోసాని కృష్ణమురళి, గిరిబాబు, రఘుబాబు, ప్రవీణ్, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, అన్నపూర్ణ, రజిత తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
మిక్కీ జే మేయర్ స్వరపరిచిన గీతాలకు రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య సాహిత్యమందించారు. పాటల్లో ``ఎల్లిపోకే శ్యామల``, ``రంగ్ దే``, ``యా యా``, ``అనసూయ కోసం``.. విశేషాదరణ పొందాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు. 2016 జూన్ 2న విడుదలై అఖండ విజయం సాధించిన `అ ఆ`.. నేటితో ఐదు వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |