![]() |
![]() |

కరోనా సెకండ్ వేవ్ కారణంగా లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు ‘కేజిఎఫ్’ స్టార్ యష్ ముందుకు వచ్చారు. కన్నడ సినీ పరిశ్రమలోని 21 డిపార్ట్‌మెంట్స్ లో ఉన్న 3000 మంది సభ్యులకు.. ఒక్కొక్కరికి రూ. 5000 చొప్పున ఆర్ధిక సహాయం అందించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా యష్ తాజాగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.
‘‘కరోనా మహమ్మారి అనే కనిపించని శత్రువు.. ఎందరో ప్రాణాలను బలి తీసుకుంది.. చాలామందికి జీవనోపాధి లేకుండా చేస్తుంది. నా సొంత ఇండస్ట్రీ అయిన కన్నడ సినీ పరిశ్రమ కూడా ఎంతగానో నష్టపోయింది. ఈ క్లిష్ట సమయంలో నా సంపాదనలో నుంచి ఇండస్ట్రీలోని 21 విభాగాలలో పనిచేసే 3000 మంది సభ్యులకు.. ఒక్కొక్కరికి రూ. 5000 చొప్పున వారి బ్యాంక్ అకౌంట్స్ కు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఈ సాయం వారి కష్టాలనన్నింటినీ తీర్చలేదని తెలుసు.. కానీ ఎంతో కొంత ఊరటనిస్తుంది.’’ అని యష్ తన ట్వీట్‌లో తెలిపారు. యష్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
కాగా ‘కేజిఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిన యష్.. త్వరలోనే ‘కేజిఎఫ్ చాప్టర్ 2’ తో సందడి చేయనున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ కోసం కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాకుండా.. ఇతర భాషలకు చెందిన ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
![]() |
![]() |