![]() |
![]() |

సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన రెండో చిత్రం 'సంప్రదాయం' (1996). మొదటి చిత్రం 'నెంబర్ వన్' సూపర్ హట్టవగా, 'సంప్రదాయం' బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమాకి సంబంధించి రెండు విశేషాలున్నాయి. వాటిలో ఒకటి.. వేణుమాధవ్ హాస్యనటుడిగా పరిచయం కావడం. మిమిక్రీ ఆర్టిస్టుగా అనేక ప్రదర్శనల ద్వారా ప్రజలను ఆకట్టుకుంటూ వచ్చిన వేణుమాధవ్ ప్రతిభను గుర్తించిన కృష్ణారెడ్డి ఆయనకు ఈ సినిమాలో హీరో కృష్ణ అసిస్టెంట్ క్యారెక్టర్‌ను ఇచ్చారు. కృష్ణారెడ్డి నమ్మకాన్ని నిలబెట్టిన వేణుమాధవ్ ఆ సినిమాలో రాణించడమే కాకుండా, అతి తక్కువ కాలంలోనే టాప్ కమెడియన్‌గా ఎదిగారు.
ఇక రెండో విశేషం, నిర్మలమ్మకు నటిగా ఇది చివరి సినిమా కావడం. తెలుగులో 700కు పైగా చిత్రాల్లో నటించిన లేడీ ఆర్టిస్ట్‌గా రికార్డ్ సృష్టించిన ఆమె అనారోగ్య కారణాలతో మోహన్‌బాబు సినిమా 'సోగ్గాడి కాపురం'తోటే రిటైర్ కావాలనుకున్నారు. అయితే కృష్ణ నాయనమ్మ పాత్రను ఆమెతోనే చేయించాలని కృష్ణారెడ్డి భావించారు. అందుకే ఆ ఒక్క పాత్ర చేయమని ఆయన నిర్మలమ్మను అభ్యర్థించారు. మొదట తటపటాయించినా, ఆయన మీద అభిమానంతో ఆ పాత్ర చేశారామె. ఈ సినిమా తర్వాత ఆమె ముఖానికి మళ్లీ రంగేసుకోలేదు.
ఈ రెండు విశేషాలతో పాటు ఇంకో చెప్పుకోదగ్గ విషయం.. 'సంప్రదాయం'లో హీరో కృష్ణ పెంపుడు కుక్క నటించడం. ఈ చిత్రంలో ఊరికి పెద్దగా వ్యవహరించే కృష్ణ వెంట మూడు అడుగుల ఎత్తున సింహంలాగా ఆ కుక్క కనిపిస్తూ ఉంటుంది. ఈ చిత్రంలో కృష్ణ సరసన నాయికగా ఇంద్రజ నటించగా.. దేవన్, మహేశ్ ఆనంద్ విలన్లుగా కనిపించారు.
![]() |
![]() |