![]() |
![]() |

వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలిచే విలక్షణ నటుల్లో రావు రమేశ్ ఒకరు. గత దశాబ్దకాలంలో ఆయన ధరించిన విభిన్న వేషాలు.. తెలుగునాట మరే గుణచిత్ర నటుడు (క్యారెక్టర్ ఆర్టిస్ట్) పోషించలేదంటే అతిశయోక్తి కాదు. ఘోర పరాజయం పాలైన చిత్రాల్లోనూ తనే హైలైట్ గా నిలిచిన సందర్భాలు సైతం రావు రమేశ్ ఖాతాలో చాలానే ఉన్నాయి. అలాంటి.. రావు రమేశ్ ఓ సినిమాలో నటిస్తున్నాడంటే.. ఆ చిత్రంపై ప్రేక్షకుల్లో ఎంతో కొంత నమ్మకం ఉంటుంది.
కాగా, తాజాగా రావు రమేశ్ ఓ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 9న థియేటర్స్ లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన కోలీవుడ్ బ్లాక్ బస్టర్ 'కర్ణన్'.. తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. మాతృకలో ధనుష్ పోషించిన టైటిల్ రోల్ లో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ దర్శనమివ్వనున్నారు. ఇక కథానాయకుడికి సన్నిహితంగా ఉంటూ, అతడికి మార్గదర్శిగా నిలిచే 'యమ రాజా' (తాత) పాత్రలో రావు రమేశ్ కనిపించనున్నారట. ఒరిజినల్ లో లాల్ పోషించిన ఈ పాత్ర.. సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది. మరి.. తెలుగులో ఈ పాత్రని రావు రమేశ్ మరింత రక్తి కట్టిస్తారేమో చూడాలి.
ఇదిలా వుంటే, 'కర్ణన్' రీమేక్ ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ప్రతీ చిత్రంలోనూ రావు రమేశ్ నటించడమే కాకుండా.. ఆయా చిత్రాలకు తనే ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. శ్రీకాంత్ తాజా చిత్రం 'నారప్ప'లో సైతం రావు రమేశ్ ఓ కీలక పాత్ర పోషించారు.
![]() |
![]() |