![]() |
![]() |

పౌరాణిక పాత్రల పోషణలో నటరత్న నందమూరి తారకరామారావు అనుల్లంఘనీయమైన ఒరవడి సృష్టించారు. ఆయన 'మాయాబజార్'లో కృష్ణుడిగా అవతరించే వరకూ పురాణ పాత్రల ఆదర్శీకరణ శైలికి అన్నివిధాలా, అనుగుణంగా, దృష్టాంతంగా నిలిచిన నటులు తెలుగులో లేరు. తన జగదేక సుందరాకారానికి విలక్షణమైన నటనా విన్యాసం జోడించడం వల్లే ఎన్టీఆర్ భారతదేశ స్థాయిలోనే అపర కృష్ణునిగా, అపర శ్రీరామచంద్రమూర్తిగా సినీప్రియుల నీరాజనాలు అందుకున్నారు.
ఎన్టీఆర్ పౌరాణిక పాత్ర నిర్వహణకు మరో చక్కని ఉదాహరణ.. 'శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం'లోని వేంకటేశ్వరస్వామి పాత్రను ఆయన పోషించిన విధానం. 1960 జనవరి 9న ఈ సినిమా విడుదలయ్యాక, దాన్ని చూడ్డానికి వెళ్లిన జనం హాలు బయట ఎన్టీఆర్ ఫొటోలకు నమస్కరించి హాలు లోపలికి వెళ్లేవారు. తిరుపతికి వెళ్లలేని పేదలు ఈ సినిమాకు వచ్చి భక్తితో కొబ్బరికాయలు కొట్టారు. ఎవరో ఇచ్చిన సలహాతో డైరెక్టర్ పి. పుల్లయ్య ఆ సినిమా ఆడుతున్న హాళ్లలో హుండీలు పెట్టించారు. ఆ హుండీల ద్వారా అప్పట్లోనే సుమారు రూ. 46 వేలు రాగా, దానికి మరో నాలుగు వేలు కలిపి తిరుమల తిరుపతి దేవస్థానానికి యాత్రికుల సౌకర్యార్థం ధర్మసత్ర నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు ఆ చిత్రానికి నిర్మాత కూడా అయిన పుల్లయ్య.
ఈ సినిమాలో వేంకటేశ్వరుని విగ్రహంలోంచి ఎన్టీఆర్ నడచివచ్చే సన్నివేశం చూడ్డానికే పదేపదే జనం వచ్చేవారు. షావుకారు జానకి మాటల్లో చెప్పాలంటే.. "రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి ఇలాగే ఉండేవారు. ముఖ్యంగా వారు వేంకటేశ్వర మహత్యం చిత్రంలో గర్భగుడిలో వేంకటేశ్వరస్వామి విగ్రహం నుండి నడచివచ్చే సన్నివేశం జీవితాంతం మర్చిపోలేను. ఆ గోవిందుడిని రామారావుగారిలో చూసుకున్నాం."
ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ నివాసం ఉండే మద్రాస్ త్యాగరాయనగర్‌లోని 28 బజుల్లా రోడ్ తిరుపతి యాత్రికులతో కిటకిటలాడుతూ వచ్చింది. తిరుపతి, శ్రీకాళహస్తి, కంచి తదితర దక్షిణదేశ క్షేత్రాలను సందర్శించడానికి వచ్చే తెలుగువారు మద్రాసు వస్తే, ఎన్టీఆర్‌ను దర్శించుకోకుండా వెళ్లేవారు కాదంటే ఆ పాత్రలో ఆయన ఎంతగా ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేశారో ఊహించవచ్చు.

![]() |
![]() |