![]() |
![]() |

ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా నటించిన 'మనసంతా నువ్వే' (2001) మూవీ ఒక మ్యూజికల్ బ్లాక్‌బస్టర్. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో ఎం.ఎస్. రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లో మంచి జోరు మీదున్న ఆర్పీ పట్నాయక్ స్వరాలు కూర్చిన ఈ సినిమాలోని పాటలన్నీ ప్రజాదరణ పొందినవే. ఆ సినిమాకు రచన చేసిన పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణకు ఇందులోని పాటలన్నీ ఇష్టమే కానీ, "చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా" పాటంటే మరింత ఇష్టం.
సాధారణంగా డైలాగుల గురించి కానీ, కథను గురించి కానీ చెప్పమంటే అనర్గళంగా చెప్పగల గోపాలకృష్ణ పాటల గురించి కూడా అదే స్థాయిలో చెప్పగలరని చాలా మందికి తెలీదు. "చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా" పాట గురించి ఆయన చెప్పింది వింటే ఎంతలోతుగా ఆయన పరిశీలిస్తారో అర్థమవుతుంది.
"పూర్వం ప్రబంధాల్లో యోజనగంధి అనే యువతి గురించి, ఆమె శరీరం నుండి వెలువడే సౌరభం గురించి చదువుకున్నాం. హీరోయిన్ గురించి హీరో ఈ పాటలో పాడుతూ ఆమె పీల్చి వదిలిన గాలి పరిమళం ఆమె వచ్చిందని చెప్పిందట. చిన్నప్పుడు ఊహ తెలియని వయసులో విడిపోయి పన్నెండు సంవత్సరాల తర్వాత ఆమె అక్కడికి వచ్చి వెళితే ఆ గాలి ఆమె వచ్చిందని చెప్పడం ప్రేమకి బ్యూటిఫుల్ ఎక్స్‌ప్రెషన్. ప్రబంధ లక్షణాలున్న పొయెట్రీ రాశారు సీతారామశాస్త్రి ఈ పాటలో.." అంటూ ఒక సందర్భంలో 20 నిమిషాల పాటు ఆగకుండా మెచ్చుకున్నారు పరుచూరి గోపాలకృష్ణ.
ఆయన చెప్పినట్లుగా ఆ పాట చరణంలో "ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది" అని రాశారు సీతారామశాస్త్రి. ఉషతో ఆర్పీ పట్నాయక్ స్వయంగా ఆలపించిన ఈ మోడరన్ క్లాసిక్ సాంగ్ ఇప్పటికీ తరచుగా ఎక్కడో చోట వినిపిస్తూ, కనిపిస్తూనే ఉంటుంది.
![]() |
![]() |