Home  »  News  »  నట విశ్వరూపానికి నిలువెత్తు నిదర్శనం

Updated : May 20, 2021

ఈ జనరేషన్ లో కంప్లీట్ యాక్టర్ అంటే ముక్తకంఠంతో వినిపించే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కానీ.. యాక్టర్ గా ఆయన ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. పెద్ద ఎన్టీఆర్ లాగే పాత్రల్లో పరకాయప్రవేశం చేస్తాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ పాత్రలో తారక్ తప్ప మరెవరూ ఇంతలా మెప్పించరేమో అనేలా నటవిశ్వరూపం చూపిస్తాడు. వయస్సు తక్కువే, చేసిన సినిమాలు తక్కువే.. కానీ విభిన్న పాత్రలు పోషించి నటుడిగా ఆయన వేసిన ముద్ర అమోఘం. ఆయన ఏదైనా పాత్ర పోషిస్తే మనకు ఎన్టీఆర్ కనిపించడు.. ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ గా నటించడు.. నటుడిగా జీవిస్తాడు. అందుకే ఆయన పోషించిన పాత్రలు మనకి అంత చేరువవుతున్నాయి.

ఈరోజు(మే 20) తారక్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటి వరకు ఆయన పోషించిన విభిన్న పాత్రలను ఒకసారి గుర్తు చేసుకుందాం.

చారి(అదుర్స్): తారక్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఓ మాస్ హీరో. మాస్ లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అలాంటి తారక్ ఓ అమాయకపు పూజారి పాత్రలో నటించి ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. కానీ తారక్ ఆ పని చేసి చూపించాడు. చారి పాత్రలో జీవించి, భట్టుతో కలిసి నవ్వులు పూయించి.. అందరిచేత 'అదుర్స్' అనిపించుకున్నాడు. 

 

దయ(టెంపర్): 'నా పేరు దయ.. నాకు లేనిదే అది' అంటూ ఈ సినిమాలో తారక్ తన టెంపర్ ని చూపించాడు. 'వన్ మ్యాన్ షో' కి డెఫినేషన్ ఏంటి అంటే టెంపర్ లో తారక్ యాక్టింగ్ అని చెప్పేయొచ్చు. బ్యాడ్ పోలీస్ నుండి గుడ్ పోలీస్ గా మారే 'దయ' అనే నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో తారక్ ఒదిగిపోయాడు. పోసాని, తనికెళ్ళ భరణిలతో వచ్చే సీన్స్ తో పాటు.. కోర్ట్ సీన్ లో తారక్ యాక్టింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. టెంపర్ సినిమాను ఇతర బాషల్లో రీమేక్ చేసినప్పటికీ ఎవ్వరూ తారక్ యాక్టింగ్ ని మ్యాచ్ చేయడం కాదు కదా దగ్గరికి కూడా రాలేకపోయారంటే.. 'దయ'గా తారక్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.

 

రామకృష్ణ(రాఖీ): 'అన్న అంటే చెల్లి చేత రాఖీ కట్టించుకునే వాడే కాదు.. చెల్లికి అన్యాయం చేసిన వాడిని చంపడానికి కూడా వెనకాడడు' అని తెలియజేసిన సినిమా రాఖీ. ఈ సినిమాలో తారక్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆడవారికి అన్నలా అండగా ఉంటూ.. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని మనుషుల రూపంలో ఉన్న మృగాలను శిక్షించే పాత్రలో తారక్ జీవించాడు. క్లైమాక్స్ లో కోర్ట్ సీన్ లో తారక్ చెప్పే లెంగ్థీ డైలాగ్ కి ఎవరైనా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే.  అంతటి లెంగ్థీ డైలాగ్ ని సింగల్ టేక్ లో చెప్పి నట దిగ్గజాల చేత సైతం శభాష్ అనిపించుకున్నాడు.

 

యంగ్ యమ (యమదొంగ): తారక్ లావుగా ఉంటాడని, లుక్స్ విషయంలో కేర్ తీసుకోడని వచ్చిన విమర్శలకు 'యమదొంగ' సినిమాతో సమాధానం చెప్పాడు తారక్. ఈ మూవీలో కొత్త ఎన్టీఆర్ ని చూస్తాం. లుక్స్, డాన్స్, ఫైట్స్, యాక్టింగ్ అన్ని అదరగొట్టాడు తారక్. ముఖ్యంగా యంగ్ యమగా తన నట విశ్వరూపాన్ని చూపించాడు. సీనియర్ నటుడు మోహన్ బాబుతో పోటాపోటీగా నటించి ఔరా అనిపించుకున్నాడు. ఈ తరంలో పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించగల హీరో తానేనని నిరూపించాడు. 

 

రావణ్ (జై లవ కుశ): నటుడిగా ఒక పాత్ర చేసి మెప్పించడమే గొప్ప అనుకుంటే.. ఒకే సినిమాలో మూడు పాత్రలు పోషించి మెప్పించడం మామూలు విషయం కాదు. కానీ తనకి మాములు విషయమే అని 'జై లవ కుశ' సినిమాతో తారక్ నిరూపించాడు. ముఖ్యంగా నెగటివ్ షేడ్స్ ఉన్న రావణ్(జై) పాత్రలో ఆయన జీవించిన విధానం ప్రశంసల వర్షం కురిసేలా చేసింది. కేవలం తన నటన కోసమే ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ మూవీని చూసేలా చేసింది.

 

ఇలా తారక్ ఏ పాత్ర పోషించినా అందులో ఒదిగిపోతాడు. 19-20 ఏళ్ళకే ఆది, సింహాద్రి వంటి సినిమాల్లో నటించి మాస్ ని మెప్పించాడు. తన యాక్టింగ్, డాన్స్, డైలాగ్స్ తో మాస్ ని ఉర్రూతలూగించాడు. 'నాన్నకు ప్రేమతో'లో ఆఖరి క్షణాల్లో తండ్రి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం పరితపించే కొడుకు పాత్రలో నటించిన తారక్ కన్నీళ్ళు తెప్పించాడు. బృందావనంలో లవర్ బాయ్ పాత్రలో అల్లరి చేశాడు. జనతా గ్యారేజ్ లో బాధ్యత గల యువకుడి పాత్రలో మెప్పించాడు. ఇక 'అరవింద సమేత'లో అయితే తండ్రి చనిపోయిన బాధని కళ్ళలో చూపిస్తూ సినిమా అంతా క్యారీ చేశాడు. అదే మూవీలో ఒక సీన్ లో ఫోనులో వార్నింగ్ ఇచ్చి.. కేవలం స్వరంతో చావు భయం కలిగించవచ్చా అని అందరూ ఆశ్చర్యపడేలా చేశాడు.

ప్రస్తుతం తారక్ రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' మూవీలో నటిస్తున్నాడు. ఇందులో తారక్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో తారక్ నట విశ్వరూపం నేషనల్ వైడ్ గా తెలియనుంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.