![]() |
![]() |
.jpg)
``చూడు.. ఒకవైపే చూడు.. రెండో వైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు.. మాడిపోతావ్`` - ఈ డైలాగ్ సరిగ్గా పదకొండేళ్ళ క్రితం థియేటర్లలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `సింహా` చిత్రం కోసం నటసింహ నందమూరి బాలకృష్ణ పలికిన ఈ పవర్ ఫుల్ డైలాగ్.. నందమూరి అభిమానులనే కాదు సగటు ప్రేక్షకులను కూడా విశేషంగా అలరించింది. తండ్రీకొడుకులుగా బాలయ్య ద్విపాత్రాభినయం `సింహా`కి ప్రధాన బలంగా నిలవగా.. మాస్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను టేకింగ్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళింది. మరీముఖ్యంగా.. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్ర డాక్టర్ నరసింహ (బాలయ్య)ని బోయపాటి తీర్చిదిద్దిన విధానం.. ఆ పాత్రలో నెవర్ సీన్ బిఫోర్ డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్ తో బాలయ్య అలరించిన తీరు జననీరాజనాలు అందుకుంది. కట్ చేస్తే.. 2010లో విడుదలైన చిత్రాల్లో టాప్ గ్రాసర్ గా రికార్డులకెక్కింది.
బాలయ్యకి జంటగా నయనతార, స్నేహా ఉల్లాల్, నమిత నటించిన ఈ సినిమాలో కేఆర్ విజయ, బ్రహ్మానందం, ఆదిత్య మీనన్, కోట శ్రీనివాసరావు, చలపతిరావు, వేణు మాధవ్, ఝాన్సీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. చక్రి స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ``సింహమంటి చిన్నోడు``, ``బంగారు కొండ``.. ఈ రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. `ఉత్తమ నటుడు` (బాలకృష్ణ), `ఉత్తమ సంగీత దర్శకుడు` (చక్రి), `ఉత్తమ హాస్య నటి` (ఝాన్సీ) విభాగాల్లో `సింహా` చిత్రానికి `నంది` పురస్కారాలు దక్కాయి. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మించిన `సింహా`.. నేటితో (ఏప్రిల్ 30)తో 11 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |