![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో పలు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. వాటిలో `యముడికి మొగుడు` ఒకటి. టైటిల్ కి తగ్గట్టే.. `యముడు` చుట్టూ అల్లుకున్న ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో యముడిగా కైకాల సత్యనారాయణ నటించగా, అతనికి మొగుడిగా చిరంజీవి అలరించారు. చిరుకి జోడీగా విజయశాంతి, రాధ నటించిన ఈ సినిమాలో చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య దర్శనమిచ్చారు. రావుగోపాలరావు, గొల్లపూడి మారుతిరావు, కోట శ్రీనివాసరావు, సుధాకర్, హరిప్రసాద్, ప్రసాద్ బాబు ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ.. తమిళంలో `అతిశయ పిరవి` (సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడు) పేరుతో రీమేక్ అయింది. డైనమిక్ మూవీ మేకర్స్ పతాకంపై చిరు మిత్రులు, నటులు సుధాకర్, హరిప్రసాద్, నారాయణరావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. రూ. 5 కోట్లకు పైగా షేర్ రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా `యముడికి మొగుడు` అప్పట్లో రికార్డులకెక్కడం విశేషం.
రాజ్ - కోటి స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ అప్పటి కుర్రకారుని ఉర్రూతలూగించాయి. ``అందం హిందోళం``, ``వానజల్లు గిల్లుతుంటే``, ``బహుశా నిన్ను``, ``ఎక్కు బండెక్కు మామ``, `కన్నెపిల్ల తోటి``, ``నో నో నాట్యమిదా``.. ఇలా ఇందులోని ప్రతీ పాట చార్ట్ బస్టర్ నే.
1988 ఏప్రిల్ 29న విడుదలై జననీరాజనాలు అందుకున్న `యముడికి మొగుడు`.. నేటితో 33 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |