![]() |
![]() |
.jpg)
సౌత్ ఇండియన్ టాప్ కమెడియన్లలో ఒకరైన తమిళ నటుడు వివేక్ ఈ నెల 16న గుండెపోటుతో చెన్నైలోని వడపళనిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారు. ఏప్రిల్ 17న ఆయన మృతి చెందిన వార్త బయటకు రావడంతో ఆయన అభిమానుల గుండెలు పగిలాయి. కోలీవుడ్ అంతా విషాద వాతావరణం నెలకొంది. టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా వివేక్ మృతిని జీర్ణం చేసుకోలేకపోతున్నామంటూ సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలియజేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన వివేక్ అంత్యక్రియలను తమిళనాడు ప్రభుత్వం పోలీసు లాంఛనాలతో జరిపించింది.
వివేక్ మరణించిన అదే రోజు సాయంత్రం అభిమానులు, పలువురు సెలబ్రిటీల సమక్షంలో ఆయన పార్థివదేహానికి విరుగంబాక్కం శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఇప్పుడు, వివేక్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు మదురైకి సమీపంలోని ఆయన పూర్వీకుల గ్రామమైన పెరుంగొటూర్‌లో ఆయన అస్థికలను అక్కడి శ్మశానవాటికలో పాతిపెట్టి, ఆ స్థలంలో మొక్కలను నాటారు. మొక్కలంటే వివేక్‌కు ఎంతో ఇష్టం. అందుకే కుటుంబ సభ్యులు ఆయన ఆకాంక్షకు అనుగుణంగా ఆయన అస్థికలపై మొక్కలను నాటారు.
పర్యావరణ కార్యకర్త అయిన వివేక్ మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం స్ఫూర్తితో 2011లో 'గ్రీన్ కలామ్' ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద ఒక కోటి మొక్కలను నాటాలనేది ఆయన సంకల్పం. తను మృతి చెందే నాటికి 33.23 లక్షల మొక్కలను ఆయన నాటారు. ఆయన కలను నిజం చేసే దిశగా అభిమానులు ఇప్పటికే అడుగు ముందుకు వేశారు. కోటి మొక్కలను నాటే కార్యక్రమాన్ని తాము పూర్తి చేస్తామని ప్రతిన పూనారు.
![]() |
![]() |