![]() |
![]() |

సాయిపల్లవితో 'లవ్ స్టోరి' పూర్తి చేసిన నాగచైతన్య నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'థాంక్ యూ'. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో రాశీ ఖన్నా హీరోయిన్. దిల్ రాజు నిర్మిస్తున్నారు. కొవిడ్-10 దెబ్బకు మరోసారి టాలీవుడ్ పరిస్థితి ఇక్కట్లలో పడి, చాలా సినిమాలు షూటింగ్‌లు ఆగిపోయినా, నాగచైతన్య ఆగలేదు. దేశంలో నిరాటంకంగా షూటింగ్ చేసుకోవడానికి పరిస్థితులు రోజురోజుకూ ప్రతికూలంగా మారుతున్న నేపథ్యంలో 'థాంక్ యూ' షూటింగ్ ఇప్పుడు ఇటలీలోని మిలన్ నగరంలో జరుగుతోంది.
అక్కడ ఆన్ లొకేషన్ ఫొటోలను రెండింటిని సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఒకటి నాగచైతన్య ఫొటో కాగా, ఇంకొకటి డైరెక్టర్ విక్రమ్ కుమార్‌ది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ నిర్వహిస్తున్నామనీ, మహమ్మారిని ఎదుర్కోవడానికి తగ్గ శక్తి తమతో ఉంటుందని ఆశిస్తున్నామనీ ఆయన రాసుకొచ్చారు. 'మజిలీ'లో క్రికెట్ ప్లేయర్‌గా కనిపించిన చైతూ 'థాంక్ యూ'లో హాకీ ప్లేయర్‌గా నటిస్తున్నాడు. 'మజిలీ'లో రెండు దశలుగా అతని పాత్ర నడిస్తే, ఈ సినిమాలో మూడు దశల్లో కనిపిస్తుందని సమాచారం. యంగ్ స్టేజ్‌లో మహేశ్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా అతను కనిపిస్తాడు.
మాళవికా నాయర్ మరో నాయికగా నటిస్తోన్న ఈ సినిమాకు తమన్ బాణీలు సమకూరుస్తున్నాడు. బీవీఎస్ రవి కథ అందించాడు. 'మనం' లాంటి క్లాసిక్ మూవీ తర్వాత చైతూ, విక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

![]() |
![]() |