![]() |
![]() |
.jpg)
నటరత్న నందమూరి తారక రామారావు - దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. వీరిద్దరు జట్టుకట్టిన సినిమాల్లో సింహభాగం హిట్టుకొట్టాయి. అలాంటి వీరి కాంబోలో వచ్చిన చివరి చిత్రంగా 'మేజర్ చంద్రకాంత్'కి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ - రాఘవేంద్రరావు ఫస్ట్ కాంబినేషన్ మూవీ 'అడవి రాముడు' (1977) ఎలాగైతే ఏప్రిల్ నెలలో విడుదలై సంచలన విజయం సాధించిందో.. లాస్ట్ జాయింట్ వెంచర్ 'మేజర్ చంద్రకాంత్' (1993) కూడా అదే ఏప్రిల్ నెలలో రిలీజై ఘనవిజయం సాధించడం విశేషం.
ఇక 'మేజర్ చంద్రకాంత్' విషయానికొస్తే.. సరిగ్గా 28 ఏళ్ళ క్రితం ఇదే ఏప్రిల్ 23న విడుదలై జననీరాజనాలు అందుకుంది. టైటిల్ రోల్‌లో నందమూరి తారక రామారావు మరోసారి నటవిశ్వరూపం ప్రదర్శించగా.. ఆయన తనయుడిగా, మరో హీరోగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా అలరించారు. ఎన్టీఆర్‌కి జంటగా శారద.. మోహన్ బాబుకి జోడీగా నగ్మా, రమ్యకృష్ణ నటించిన ఈ చిత్రంలో దేశభక్తి, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్, కామెడీ.. ఇలా అన్ని అంశాలను మేళవించి జనరంజకంగా తీర్చిదిద్దారు దర్శకేంద్రుడు.
ఇక స్వరవాణి కీరవాణి బాణీలతో రూపొందిన ఆడియో.. అప్పట్లో ఓ సంచలనం. మరీ ముఖ్యంగా.. "పుణ్యభూమి నా దేశం నమోనమామి" పాట అయితే ఎవర్ గ్రీన్. ఈ గీతంలో పలు చరిత్రపురుషుల వేషాల్లో ఎన్టీఆర్ తన అభినయం, ఆహార్యంతో తెలుగు ప్రేక్షకులను మురిపించారు. ఇలా.. ఎన్నో విశేషాలకు చిరునామాగా నిలిచిన 'మేజర్ చంద్రకాంత్' నేటితో 28 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |