![]() |
![]() |

జె.డి. చక్రవర్తి అనగానే మనకు మొదట గుర్తొచ్చే సినిమా 'శివ'. అందులో చేసిన జె.డి. అనే నెగటివ్ రోల్‌తోటే ఫేమస్ అయిపోయాడు మనవాడు. తన గురువు రామ్‌గోపాల్ వర్మ ద్వారానే 'సత్య' సినిమా చేసి నేషనల్ ఫిగర్ కూడా అయ్యాడు. కెరీర్‌లో ఒకానొక సమయంలో మంచి క్రేజ్ సంపాదించిన అతను, తర్వాత అట్టడుగుకు పడిపోయాడు. కానీ అవేవీ అతడిని బాధించవు. ఎందుకంటే మిగతా స్టార్ల మాదిరిగా కెరీర్ గురించిన బాధలేమీ అతడికి లేవు కాబట్టి.
ఏ విషయమైనా హిపోక్రసీ లేకుండా మాట్లాడటం చక్రి నైజం. దానివల్ల ఇబ్బందులు ఎదురైనా అతను పట్టించుకోడు. అతడి తల్లి కోవెల శాంత పేరుపొందిన శాస్త్రీయ సంగీతకారిణి, రిటైర్డ్ ప్రొఫెసర్. చక్రి జీవితంలో ఆమె పాత్ర ఎంతైనా ఉంది. అయితే అతడి తండ్రి గురించి చాలా మందికి తెలీదు. నిజానికి తండ్రి అంటే తనకు చాలా అసహ్య అంటాడు చక్రి. దానికి అతను చెప్పే కారణం వింటే మనం షాకవుతాం.
ఒక ఇంటర్వ్యూలో తండ్రి గురించి చెప్పమంటే, "ఐ హేట్ మై ఫాదర్. మా నాన్న అంటే నాకు అసహ్యం. మా ఫాదర్ పచ్చి తిరుగుబోతు, తాగుబోతు, మమ్మని కొడుతుండె, నన్ను కొడుతుండె, టైమ్‌కి ఇంటికి రాకపోతుండె.. అట్లుంటె మస్తుంటుంది. అట్లుంటే నిజంగా చాలా బాగుండేది. కానీ.. నాకు ఊహ వచ్చిన దగ్గర్నుంచి మా ఫాదర్ నన్ను కొట్టడం తెలీదు, తిట్టడం తెలీదు. శనివారం, ఆదివారం వస్తే కచ్చితంగా 6 సినిమాలు చూసేవాళ్లం, ఏడో సినిమా కూడా ఒక్కోసారి ఉండేది. అంటే శనివారం మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, ఆదివారం అయితే ఆ మూడు షోలతో పాటు సెకండ్ షో కూడా చేసేవాళ్లం. అట్లా ఆయన మమ్మల్ని తీసుకువెళ్లేవాడు. స్కూలుకు వెళ్లాలని లేకపోతే నేను మా ఫాదర్‌కు వెళ్లి చెప్పేవాడ్ని. "ఒక పనిచెయ్యి. కాస్త ముందరకెళ్లి పడిపో.. అదిచూసి మీ అమ్మ నిన్ను పంపడం మానేస్తుంది." అనేవాడు. అంటే.. సినిమాల్లోనూ, బుక్స్‌లోనూ రాసేంత గొప్ప ఫాదర్. నా పదమూడేళ్ల వయసులో చనిపోయాడు. అందుకే ఆయన్ని నేను ద్వేషిస్తాను. నేనింకా పెద్దవాడ్నయి, ఇప్పటికీ ఉండుంటే బాగుండేది కదా. నా చిన్న వయసులోనే చనిపోయారు కాబట్టి, ఐ హేట్ హిమ్. మోస్ట్ ఐడియల్ హజ్బెండ్ అండ్ ఫెంటాస్టిక్ ఫాదర్. ఐ మిస్ హిమ్ ద మోస్ట్." అని చెప్పుకొచ్చాడు చక్రి.
![]() |
![]() |