![]() |
![]() |

నటుడు 'వేదం' నాగయ్య వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తన స్వస్థలం దేచవరంలోని ఇంట్లో మృతి చెందిన విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన వేదం సినిమాతోటే అందరికీ ఆయన తెలియడంతో, అప్పట్నుంచీ ఆయన 'వేదం' నాగయ్యగా పేరు పొందారు. కానీ ఆయన మృతి టాలీవుడ్‌లోని ఎక్కువ మందిని కదిలించినట్లు కనిపించలేదు. 'వేదం' తర్వాత ఆయన ఎక్కువ సినిమాలేమీ చెయ్యలేదు. అడపా దడపా మాత్రమే ఆయనకు అవకాశాలు లభిస్తూ వచ్చాయి. 30 నుంచి 35 సినిమాల మధ్య ఆయన నటించారు. వాటి ద్వారా ఆయన అందుకున్న రెమ్యూనరేషన్ కూడా తక్కువే. ఒకసారి ఫిల్మ్‌నగర్ వీధుల్లో కనిపించి, అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఫిల్మ్ జర్నలిస్టుల వద్ద వాపోయారు కూడా.
కరోనా ఎఫెక్ట్ ఆయన మీద బాగా పడింది. దాంతో సొంతూరికి వెళ్లిపోయారు. మార్చి 27న ఈ లోకాన్నే వదిలి వెళ్లిపోయారు. కానీ మీడియా తప్ప ఫిల్మ్ ఫ్రాటర్నిటీ పెద్దగా పట్టించుకోలేదు. 'వేదం'లో నాగయ్య సహనటి అయిన సూపర్ హీరోయిన్ అనుష్క మాత్రం ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే సంతాపం ప్రకటించింది. తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా 'వేదం' మూవీ ఈవెంట్‌లో నాగయ్యతో ఉన్న తన పిక్చర్‌ను ఆమె షేర్ చేసింది. "ఈరోజు ఒక మంచి ఆత్మ స్వర్గానికి ఎగిరిపోయింది. నాగయ్యగారి ఫ్యామిలీకి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ విషాదం నుంచి వారు త్వరగా కోలుకోవాలని, వారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఓం శాంతి" అని రాసుకొచ్చింది.
నాగయ్య చనిపోయిన ఒక రోజు తర్వాత డైరెక్టర్ క్రిష్ స్పందించాడు. బహుశా పవన్ కల్యాణ్ సినిమాతో బాగా బిజీగా ఉండి ఉంటాడు. అందుకే ఆలస్యంగా స్పందించాడు. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నాగయ్య పిక్చర్‌ను షేర్ చేసి, "రాములు గారు.. మీ మగ్గానికి సెలవు ఇచ్చారు.. కానీ మీరెన్నటికీ వుంటారు." అని ట్వీట్ చేశాడు. 'వేదం'లో నాగయ్య చేనేతకార్మికుడు రాములు పాత్రను పోషించిన విషయం గుర్తుండే ఉంటుంది.
అయితే 'వేదం' సినిమా చేసిన కొంత కాలం తర్వాత తాను క్రిష్‌ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్తే, వాచ్‌మన్ అడ్డుకున్నాడనీ, ఎంత చెప్పినా లోనికి పంపలేదనీ నాగయ్య గతంలో బాధపడ్డారు. అంతే కాదు, 'స్పైడర్' సినిమాలో తాను నాలుగు రోజులు మహేశ్ బాబుతో కలిసి పనిచేశాననీ, సెట్స్ బయట ఆయనను కలవడానికి ప్రయత్నిస్తే, బాడీగార్డ్ అనుమతించలేదనీ కూడా ఆయన వాపోయారు. ఒక్క అనుష్కను మాత్రం ఆయన మెచ్చుకున్నారు. అనుష్క బంగారం లాంటి మనిషనీ, ఎంతో ఆప్యాయంగా, ఆత్మీయంగా మాట్లాడుతుందనీ ఆయన చెప్పారు.
![]() |
![]() |