![]() |
![]() |

జాతీయ అవార్డ్ గ్రహీత, మూడు రోజుల క్రితం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన పాపులర్ డైరెక్టర్ ఎస్.పి. జననాథన్ ఆదివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని అపోలో హాస్పిటల్స్‌లో ఆయన చికిత్స పొందుతూ వచ్చారు. తన లేటెస్ట్ ఫిల్మ్ 'లాబమ్' ఎడిటింగ్ పనుల్లో ఉంటూ, మధ్యాహ్నం ఇంటికి భోజనం చేయడానికి వెళ్లిన ఆయన అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. డైరెక్టర్ ఆర్ముగకుమార్ చెప్పిన దాని ప్రకారం ఈరోజు ఉదయం గుండె పట్టేయడంతో మృతిచెందారు.
తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకొనే దర్శకుల్లో ఒకరిగా జననాథన్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. మూడు రోజుల క్రితం ఆయన అసిస్టెంట్ డైరెక్టర్లలో ఒకరు జననాథన్ తన ఇంట్లో అపస్మాకర స్థితిలో పడిపోయి ఉండగా కనుగొన్నారు. వెంటనే ఆయనను సమీప హాస్పిటల్‌కు తరలించగా, ఆయన పరిస్థితి క్రిటికల్‌గా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈ రోజు అపోలో హాస్పిటల్‌లో ఆయన ఆఖరి శ్వాస విడిచారు. ఈ వార్త బయటకు రాగానే అన్ని వైపుల నుంచీ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
జననాథన్ లేటెస్ట్ ఫిల్మ్ 'లాబమ్'లో విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ జంటగా నటించారు. జగపతిబాబు ఓ కీలక పాత్ర చేశారు. రెండు నెలల క్రితం ఆ సినిమా టీజర్ విడుదలై, మంచి రెస్పాన్స్ సాధించింది. తొలిచిత్రం 'ఇయర్కై'తోటే జననాథన్ నేషనల్ అవార్డ్ సాధించడం విశేషం.
![]() |
![]() |