![]() |
![]() |

తారాగణం: రాజ్‌కుమార్ రావ్, నుష్రత్ భరూచా, మహమ్మద్ జీషన్ అయూబ్, సౌరభ్ శుక్లా, సతీశ్ కౌశిక్, ఇళా అరుణ్, జతిన్ శర్మ, గరిమా కౌర్, నమన్ జైన్, బల్జిందర్ కౌర్, సుపర్ణ మార్వా, రాజీవ్ గుప్తా
స్క్రీన్‌ప్లే, డైలాగ్స్: లవ్ రంజన్, అసీమ్ అరోరా, జీషన్ ఖాద్రి
సంగీతం: హితేశ్ సోనిక్, గురు రణ్‌ధావా, యో యో హనీసింగ్, విశాల్-శేఖర్
సినిమాటోగ్రఫీ: ఈషిత్ నరైన్
ఎడిటింగ్: అకివ్ అలీ, చేతన్ సోలంకి
నిర్మాతలు: అజయ్ దేవ్‌గణ్, లవ్ రంజన్, అంకుర్ గార్గ్, భూషణ్ కుమార్
దర్శకత్వం: హన్సల్ మెహతా
విడుదల తేది: 13 నవంబర్ 2020
ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో (ఓటీటీ)
షాహిద్, సిటీలైట్స్, అలీగర్, ఒమెర్టా వంటి సీరియస్ సినిమాలు, 'సిమ్రాన్' లాంటి బ్లాక్ కామెడీ తీసిన డైరెక్టర్ హన్సల్ మెహతా తొలిసారి రూపొందించిన ఆహ్లాదకర ఎంటర్‌టైనర్ 'ఛలాంగ్'. ఆయన ఫేవరేట్ యాక్టర్ రాజ్‌కుమార్ రావ్ ఇందులో హీరో. లవ్ రంజన్ నిర్మించిన ఈ మూవీలో నుష్రత్ భరూచా హీరోయిన్. ఈ మూవీలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, కొంత ఉత్కంఠభరిత కథనం కూడా ఉంటుందని ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌ని బట్టి మనకు అర్థమైంది. మరి సినిమా నిజంగా అందుకు తగ్గట్లే ఉందా? కొంత కాలంగా మనల్ని నిరుత్సాహపరుస్తూ వస్తోన్న హన్సల్ మెహతా ఈసారైనా తన సినిమాతో ఆకట్టుకున్నాడా? చూద్దాం...
కథ
'ఛలాంగ్' అనేది జీవితానికి అర్థమేమిటని అన్వేషించే ఒక అనాసక్త స్పోర్ట్స్ కోచ్ కథ. మహీందర్ హూడా అలియాస్ మోంటు (రాజ్‌కుమార్ రావ్) హర్యానాలోని ఝజ్జర్ అనే ప్రాంతంలో ఉన్న సర్ చోటు రామ్ స్కూల్‌లో పీటీఐ (ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్)గా పనిచేస్తుంటాడు. టీనేజ్‌లో ఉన్నప్పుడు అదే స్కూల్ తరపున అతను క్రికెట్‌తో పాటు అథ్లెటిక్ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. స్టేట్ టీమ్‌లో స్థానం కల్పించకపోవడంతో స్పోర్ట్స్‌ను అతను వదిలేస్తాడు. చాలా భారీ పుస్తకాలు చదవాల్సి వస్తుందని అర్థమయ్యాక లా చదువును కూడా అతను ఆపేస్తాడు.
అతని తండ్రి (సతీశ్ కౌశిక్) రికమెండేషన్ వల్ల స్కూల్ ప్రిన్సిపాల్ ఉషా గెహ్లాట్ (ఇళా అరుణ్) ఈ పీటీఐ ఉద్యోగాన్ని మోంటుకు ఇచ్చింది. ఆటలనేవి స్టూడెంట్స్‌కు ఉపయోగపడవని నమ్ముతున్న అతను తన పనిమీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు. స్కూల్లో ఇతర యాక్టివిటీస్‌లో తలదూరుస్తూ ఉంటాడు. ఉదాహరణకు పార్కులో తిరుగుతున్న జంటలపై దాడి చేయడం. అలా ఒకసారి ఓ మధ్యవయసు జంటను కూడా వేధిస్తాడు. ఆ మరుసటి రోజే నీలిమ ఉరఫ్ నీలు (నుష్రత్ భరూచా) ఆ స్కూల్లో కంప్యూటర్ టీచర్‌గా జాయినవుతుంది. ఆ మధ్యవయసు దంపతులు తన తల్లిదండ్రులని మోంటుకు ఆమె చెప్పినప్పుడు ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. మోరల్ పోలీసింగ్ చేస్తున్నందుకు అతడిపై ఫైర్ అవుతుంది నీలు. మోంటు తన తప్పును గ్రహిస్తాడు. క్రమేణా మోంటు, నీలు పరస్పరం దగ్గరవుతారు.

తమ బంధాన్ని పెళ్లితో మరింత గట్టిపరుచుకోవాలనుకుంటాడు మోంటు. కానీ అది జరిగే సమయానికి కథలో ఓ ట్విస్ట్ వస్తుంది. ఇంద్రమోహన్ సింగ్ (మహమ్మద్ జీషన్ అయూబ్) అనే సర్టిఫైడ్ స్పోర్ట్స్ ట్రైనర్ పీటీఐగా ఆ స్కూల్లో చేరతాడు. జీతం తగ్గించకుండా మోంటును డిమోట్ చేసి ఇంద్రమోహన్ కింద అసిస్టెంట్ పీటీఐని చేస్తారు. మోంటు నిరసన తెలిపినా, ప్రిన్సిపాల్ పట్టించుకోదు. ఇంద్రమోహన్ పిల్లలకు కఠినమైన ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెడతాడు. నీలుతో అతను స్నేహంగా ఉండటం చూసి, మోంటు కడుపు రగిలిపోతుంది. తనమీద మోంటు అసూయ చెందుతున్నాడని గ్రహించిన ఇంద్ర అతడిని తిడతాడు. కోపంతో ఊగిపోయిన మోంటు అతడిని కొడతాడు.
ఇంద్రకు క్షమాపణలు చెప్పమంటుంది ప్రిన్సిపాల్. మొదట నిరాకరించిన మోంటు, ఆ తర్వాత స్కూల్లోని రెండు టీమ్‌ల మధ్య పోటీ పెట్టమని ఆమెను రిక్వెస్ట్ చేస్తాడు. ఒక టీమ్‌కు అతను ట్రైనింగ్ ఇస్తే, ఇంకో టీమ్‌కు ఇంద్ర ట్రైనింగ్ ఇస్తాడు. కావాలంటే బెస్ట్ స్టూడెంట్స్‌ను ఎంచుకొనే వెసులుబాటు ఇస్తాడు మోంటు. తన టీమ్ ఓడిపోతే తను ఉద్యోగానికి రిజైన్ చేస్తానని, ఇంద్ర టీమ్ ఓడిపోతే అతను రిజైన్ చేయాలంటాడు మోంటు. ఈ షరతుకు ఇంద్ర సరేనంటాడు. ప్రిన్సిపాల్ కూడా దీనికి ఓకే చెప్పి, టోర్నమెంట్ కింద మూడు ఆటల్ని సెలక్ట్ చేస్తుంది.. బాస్కెట్‌బాల్, 400 మీటర్ల రిలే రన్నింగ్, కబడి. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ.
విశ్లేషణ
లవ్ రంజన్ అందించిన ఈ కథలో కొత్తదనమేమీ లేదు. ఈ తరహా కథలు టాలీవుడ్‌లోనూ చాలానే వచ్చాయి. పైగా తర్వాత ఏం జరుగుతుందనేది కూడా మనం ముందుగానే ఊహించేస్తుంటాం. ఏదేమైనప్పటికీ, పిల్లల సమగ్రాభివృద్ధిలో ఆటలనేవి కీలక పాత్ర వహిస్తాయనే వ్యాఖ్యానాన్ని ఈ సినిమా చేస్తుంది. లవ్ రంజన్, అసీమ్ అరోరా, జీషన్ ఖాద్రి కలిసి అందించిన స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. కొన్ని ఆసక్తికర ఘటనలతో కథలో మనల్ని ఇన్‌వాల్వ్ అయ్యేలా వాళ్లు చేయగలిగారు. మోంటు, ఇంద్ర శత్రువులుగా మారడానికి ముందు సన్నివేశాల్ని బాగా కల్పించారు. ఆ ఇంట్రెస్ట్‌ను సెకండాఫ్‌లోనూ క్యారీ చేశారు. క్యారెక్టరైజేషన్స్‌ను బాగా డిజైన్ చేశారు. డైలాగ్స్ కూడా ఆకట్టుకొనే రీతిలో ఉన్నాయి.
డైరెక్షన్ విషయానికి వస్తే హన్సల్ మెహతా తన జాబ్‌ను బాగా నిర్వర్తించాడు. తనకు అలవాటు లేని జానర్ అయినప్పటికీ చక్కని టేకింగ్‌తో కథను చకచకా నడిపాడు. స్పోర్ట్స్‌కు సంబంధించిన సీన్స్‌ను ఇంట్రెస్టింగ్‌గా చిత్రించడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా చూసేటప్పుడు మనకు గత ఏడాది వచ్చిన సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్-శ్రద్ధా కపూర్ మూవీ 'చిచ్చోరే' గుర్తుకు రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం తమకంటే బలమైన జట్టుతో ఏమాత్రం అంచనాలు లేని ఓ బలహీన జట్టు ఎలా భీకరంగా పోరాడిందనేది అందులో ఇప్పటికే మనం చూశాం.

ఓపెనింగ్ సాధారణంగా ఉన్నప్పటికీ, నీలు తల్లిదండ్రులను మోంటు వేధించే సీన్ నుంచి కథనంలో టెంపో క్రమంగా పెరుగుతూ పోతుంది. రెండు జట్ల మధ్య జరిగే పోటీలు ఉత్కంఠభరితంగా, రోమాంచితంగా అనిపిస్తాయి. వాటి ఎడిటింగ్ టాప్ క్లాస్‌లో ఉంది. క్లైమాక్స్‌లో మోంటు ఇచ్చే స్పీచ్‌కు స్పెల్‌బౌండ్ అవుతాం. ఆ డైలాగ్స్‌ను చాలా బాగా రాశారు. పాటల్లో టైటిల్ సాంగ్ ఒక్కటే అలరించింది. బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. టెక్నికల్‌గా చూస్తే సినిమాటోగ్రఫీకి ఫుల్ మార్క్స్ పడతాయి.
నటీనటుల అభినయం
ఎప్పటిలాగే రాజ్‌కుమార్ రావ్ తన నటనతో ఎంటర్‌టైన్ చేశాడు. అన్ని సినిమాల్లో అతని నటన ఒకే రకంగా ఉంటోందని ఎవరైనా వాదించవచ్చు. కానీ గమనిస్తే మోంటు క్యారెక్టర్‌లో అతను ఎంత చులాగ్గా ఇమిడిపోయాడో అర్థమవుతుంది. నుష్రత్ భరూచా అందంగా ఉండటమే కాదు, నీలు పాత్రకు పూర్తి న్యాయం చేసింది. మోంటు మనసునే కాదు, మన మనసుల్నీ ఆమె దోచుకుంటుంది. విలన్‌గా మహమ్మద్ జీషన్ అయూబ్ రాణించాడు. అతని డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటుంది. కాకపోతే అతని క్యారెక్టర్‌ను ఇంకా బాగా మలిచే అవకాశముంది. డ్రామాకు ఉపకరించే పాత్రలో సౌరభ్ శుక్లా తన వంతు పాత్రను సమర్థంగా పోషించాడు. తన నటనకు వంక పెట్టే అవకాశం సతీశ్ కౌశిక్ ఎప్పుడూ ఇవ్వరని మరోసారి గ్రహిస్తాం. ప్రిన్సిపాల్‌గా ఇళా అరుణ్ నప్పారు. కనిపించినంత సేపూ జతిన్ శర్మ నవ్వించాడు. పింకీ పాత్రధారి గరిమా కౌర్ చివరలో అదరగొట్టింది.
తెలుగువన్ పర్‌స్పెక్టివ్
ఓవరాల్‌గా 'ఛలాంగ్' ఒక చక్కని ఆహ్లాదకరమైన సినిమా. తారల అభినయం, ఆసక్తికరంగా సాగే కథనంతో చూడదగ్గ చిత్రం.
రేటింగ్: 3.25/5
- బుద్ధి యజ్ఞమూర్తి
![]() |
![]() |