![]() |
![]() |

సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు, బాలీవుడ్ డ్రగ్ కేసు వెలుగులోకి వచ్చినప్పట్నుంచీ, వాటిపై అనేక మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తూ, ప్రసారం చేస్తూ వస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు మాత్రం మొత్తం బాలీవుడ్‌ను టార్గెట్ చేస్తూ, అది మొత్తం చెడిపోయినవాళ్లతో, డ్రగ్ ఎడిక్ట్స్‌తో నిండిపోయిందంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు, రెండు జాతీయ చానళ్లు రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ లపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిపబ్లిక్ టీవీ, దాని జర్నలిస్టులు అర్ణబ్ గోస్వామి, ప్రదీప్ భండారి, టైమ్స్ నౌ జర్నలిస్టులు రాహుల్ శివ్‌శంకర్, నవికా కుమార్‌లపై చర్యలు తీసుకోవాల్సిందిగా పిటిషన్ నమోదైంది. మొత్తం 38 మంది నిర్మాతలు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌లో వాదులుగా బాలీవుడ్ సూపర్‌స్టార్స్ షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, మరికొంతమంది టాప్ స్టార్స్‌కు చెందిన ప్రొడక్షన్ సంస్థలతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన 'సింటా' లాంటి అసోసియేషన్స్ కూడా ఉండటం గమనార్హం. బాలీవుడ్‌పై బాధ్యాతారాహిత్య, అవమానకర వ్యాఖ్యలు చేయకుండా ఆ న్యూస్ చానళ్లను నియంత్రించడం, బాలీవుడ్ వ్యక్తులపై మీడియా ట్రయల్స్ ఆపడం ఆ దావా ఉద్దేశం.

బాలీవుడ్‌పై ఇప్పటివరకూ ప్రసారం చేసిన మొత్తం అవమానకర కంటెంట్‌ను ఆ న్యూస్ చానల్స్ తొలగించేట్లు చేయాలని ఆ దావాలో కోరారు. బాలీవుడ్‌ను 'మురికి', 'మలినం', 'డ్రగ్గీస్' లాంటి అత్యంత అవమానకర పదాలతో సంబోధించడం, బాలీవుడ్‌లోని మురికి, దుర్వాసనను అరేబియాలోని మొత్తం పరిమళ ద్రవ్యాలు కూడా తొలగించలేవంటూ మాట్లాడటాన్ని ఆ దావాలో ప్రస్తావించారు.
అంతే కాదు, అవి చేసే చెడు ప్రచారం కారణంగా బాలీవుడ్‌లోని ప్రజల జీవనోపాధి కూడా తీవ్రంగా ప్రభావితమైందని ఆ దావాలో వాదులు పేర్కొన్నారు. "బాలీవుడ్‌లోని సభ్యుల గోప్యతకు భంగం కలుగుతోంది, మొత్తం బాలీవుడ్‌ను క్రిమినల్స్‌గా చిత్రించడం ద్వారా వారి పేరు ప్రఖ్యాతులు కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నాయి" అని అందులో తెలిపారు.
ఈ పిటిషన్‌లో ద ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (పీజీఐ), ద సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (సింటా), ఇండియన్ ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (ఐఎఫ్‌టీపీసీ), స్ర్కీన్‌రైటర్స్ అసోసియేషన్ (ఎస్.డబ్ల్యు.ఎ.) వాదులుగా చేరాయి.
![]() |
![]() |