![]() |
![]() |

చక్కటి వాచకం, ఆకర్షణీయమైన ముఖం, వహ్వా అనిపించే అభినయ కలిస్తే.. వాణిశ్రీ. జూనియర్ ఆర్టిస్ట్‌గా హాస్యనటుల సరసన నటించి, అగ్రహీరోల సరసన నటించే హీరోయిన్‌గా ఎదిగిన ఆమె ఒక తరం ప్రేక్షకుల్ని తన అభినయ సామర్థ్యంతో ఉర్రూతలూగించారు. ఎన్టీఆర్ నటించి, నిర్మించిన 'ఉమ్మడి కుటుంబం' (1967) చిత్రంలో ఒక స్టేజి నాటకం సీన్‌లో యమునిగా ఎన్టీఆర్ నటిస్తే, సావిత్రిగా వాణిశ్రీ కనిపించి హాస్యం పండించారు. ఆ తర్వాత 'సతీ సావిత్రి' (1978) చిత్రంలో ఆ ఇద్దరూ అవే పాత్రలు పోషించడం విశేషం. ఎన్టీఆర్ సరసన అనేక చిత్రాలలో నటించి మెప్పించారు వాణిశ్రీ. అలాగే అక్కినేని, వాణిశ్రీ హిట్ పెయిర్‌గా పాపులర్ అయ్యారు.
గ్లామరస్ రోల్స్‌లో కూడా ఆమె తనదైన ప్రత్యేక బాణీని తెచ్చారు. బాపు వెలిగించిన 'గోరంత దీపం'లో మేకప్ లేకుండా నటించారు. 'ఇద్దరమ్మాయిలు', 'ఇల్లు ఇల్లాలు', 'గంగ-మంగ' చిత్రాలలో ద్విపాత్రాభినయం చేశారు. తెలుగు నవలలు పాపులారిటీ పొందుతూ సినిమాలుగా వస్తున్న కాలంలో అనేక నవలా చిత్రాలలో కథానాయికగా నటించారు వాణిశ్రీ. 'కృష్ణవేణి', 'అభిమానవతి' లాంటి చిత్రాలు ఆమెకు అమితంగా పేరు తెచ్చాయి.
పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడి కొన్నేళ్లపాటు సినీ రంగానికి దూరమైన ఆమె, తిరిగి తన వయసుకు తగ్గ పాత్రలతో వచ్చారు. అత్త పాత్రలకు కొత్త వరవడి తీసుకొచ్చారు.
![]() |
![]() |