![]() |
![]() |

సెకండ్ ఇన్నింగ్స్‌లో రెట్టించిన ఉత్సాహంతో, యమ స్పీడుతో సినిమాలు ఒప్పుకుంటూ వెళ్తోన్న మెగాస్టార్ చిరంజీవి ప్రయోగాలకు కూడా సై అంటున్నారు. రాజకీయాల కారణంగా దాదాపు తొమ్మిదేళ్ల పాటు సినిమాలకు దూరమై, తిరిగొచ్చిన ఆయన మొదట ఒకదాని కొకటి పొంతనలేని రెండు పాత్రలు పోషిస్తూ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'ఖైదీ నంబర్ 150' సినిమా చేసి ఘన విజయం సాధించారు. తర్వాత రాయలసీమ పాలెగాడు, స్వాతంత్ర్యం కోసం బ్రిటీషర్లతో పోరాడి అసువులు అర్పించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ 'సైరా'తో ప్రయోగం చేశారు చిరంజీవి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. పీరియడ్ స్టోరీతో తయారవుతున్న ఈ చిత్రంలో ఒక ఆశయం కోసం ఉద్యమం చేసే ఉద్యమనాయకుడి పాత్రను ఆయన పోషిస్తున్నారు.
భవిష్యత్తులో చేయబోయే సినిమాల్లో ఆయన మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. వాటిలో ఓ సినిమాలో ఆయన నున్నటి గుండుతో నటించబోతున్నారని ముందే చెప్పేశారు. దానికి ట్రయల్‌గా ముందుగానే గుండు చేయించుకున్న స్టిల్‌ను ఆయన మీడియాకు రిలీజ్ చేశారు. ఆ స్టిల్‌లో పూర్తి గుండుతో, కళ్లకు బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని చాలా కొత్తగా కనిపిస్తున్నారు చిరంజీవి. ఒక్కసారిగా సినిమాలో అలా గుండుతో కనిపిస్తే ప్రేక్షకులు షాక్ అవుతారనే ఉద్దేశంతో వాళ్లను ముందుగానే ప్రిపేర్ చేయడానికి చిరంజీవి ఈ స్టిల్‌ను రిలీజ్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం చిరంజీవి గుండు లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఆచార్య' మూవీ తర్వాత ఆయన రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకటి 'లూసిఫర్' రీమేక్ కాగా, మరో రెండు చిత్రాలను మెహర్ రమేశ్, బాబీ డైరెక్షన్‌లో చెయ్యనున్నారు. వీటిలో ఆయన ఏ సినిమాలో ఈ లుక్‌తో కనిపిస్తారనేది ఆసక్తికరం.

![]() |
![]() |