![]() |
![]() |

సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ హిట్ చూసి చాన్నాళ్ళే అయింది. దాదాపు పదేళ్ళ క్రితం సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ఎందిరన్’ (తెలుగులో 'రోబో') తరువాత రజనీ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ పడనేలేదు. ‘కోచ్చడైయాన్’ (తెలుగులో 'విక్రమసింహ') (2014), ‘లింగ’ (2014), ‘కబాలి’ (2016), ‘కాలా’ (2018), ‘2.O’ (2018) ‘పేట్ట’ (తెలుగులో 'పేట') (2019), ‘దర్బార్’ (2019).. ఇలా ఈ ‘బాషా’ స్టార్ నటించిన ఏ సినిమా కూడా ఊహించిన రీతిలో బాక్సాఫీస్‌ని మెప్పించలేకపోయింది. బ్లాక్‌బస్టర్‌గా నిలవలేకపోయింది. ఈ నేపథ్యంలో.. రజనీ తదుపరి చిత్రం ‘అణ్ణాత్తే’ పైనే ఆయన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
కోలీవుడ్‌లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ‘సిరుతై’ శివ.. ఈ భారీ బడ్జెట్ మూవీని రూపొందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ వెంచర్‌లో.. నిన్నటితరం అగ్ర కథానాయికలు ఖుష్బూ, మీనాతో పాటు ఈతరం అగ్ర కథానాయికలు నయనతార, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మెలోడీ స్పెషలిస్ట్ డి. ఇమాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘అణ్ణాత్తే’ త్వరలోనే తదుపరి షెడ్యూల్‌కి సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే.. ‘అణ్ణాత్తే’కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. తోబుట్టువుల అనుబంధం నేపథ్యంలో ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. కుటుంబ బంధాలకు పెద్ద పీట వేస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో.. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేశ్.. ఇలా ఈ నలుగురు నాయికల కాంబినేషన్‌లో రజనీకి ఉండే భావోద్వేగభరిత సన్నివేశాలు సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తాయని వినికిడి. ఇందులో రజనీకి కూతురుగా కీర్తి సురేశ్ నటిస్తుండగా.. ఖుష్బూ, మీనా, నయన్‌తో ఎలాంటి రిలేషన్ ఉంటుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ ఎలిమెంట్ అని కోలీవుడ్ ఖబర్.
మరి.. చాన్నాళ్ళుగా విజయాలు లేని రజనీ.. ఈ ఫ్యామిలీ డ్రామాతోనైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడేమో చూడాలి.
![]() |
![]() |