![]() |
![]() |

అక్కినేని వారి మూడోతరం కథానాయకుడు అఖిల్.. నాలుగోసారి అదృష్ట పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ‘అఖిల్’ (2015), ‘హలో’ (2017), ‘మిస్టర్ మజ్ను’ (2019).. ఇలా మూడు వరుస పరాజయాల తరువాత ఈసారి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’గా సందడి చేయనున్నాడు అఖిల్.
'బుట్ట బొమ్మ' పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, వాసు వర్మ ('జోష్' దర్శకుడు) ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ స్పెషలిస్ట్ గోపీసుందర్ బాణీలు అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ ఫ్యామిలీ డ్రామాలో అఖిల్‌కి అమ్మగా సీనియర్ యాక్ట్రెస్ ఆమని నటిస్తోంది. సరిగ్గా పాతికేళ్ల క్రితం.. అఖిల్ బుడిబుడి అడుగుల ప్రాయంలో నటించిన 'సిసింద్రీ' (1995)లోనూ ఆమని అమ్మగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అక్కినేని నాగార్జున నిర్మించి నటించిన ఆ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో.. మళ్ళీ పాతికేళ్ల అనంతరం అఖిల్‌కి అమ్మగా ఆమని నటిస్తుండడం సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుతుందనే చెప్పాలి. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అఖిల్, ఆమని మధ్య సాగే సన్నివేశాలకు ‘సిసింద్రీ’ తాలూకు రిఫరెన్స్ ఉంటుందని టాక్. అలాగే 'చిన్ని తండ్రి నిను చూడగా' పాటలోని కొన్ని క్లిప్స్‌ని అఖిల్ చిన్నప్పటి ఎపిసోడ్స్ కోసం రిపీట్ చేస్తున్నారని వినిపిస్తోంది.
మరి.. ‘సిసింద్రీ’ టచ్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’కి ఏమేరకు ప్లస్ అవుతుందో చూడాలి. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది.
![]() |
![]() |