![]() |
![]() |

టాలీవుడ్‌లో విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి నటించిన లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ 'సుయోధన'. వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ, శ్రీరామనవమి కానుకగా మార్చి 27న విడుదలైంది. ఒక విభిన్నమైన పాయింట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ 'సుయోధన' ఏ మేరకు థ్రిల్ చేసిందో ఇప్పుడు చూద్దాం. (Suyodhana Movie Review)
కథ:
వరుణ్ (ప్రియదర్శి) ఒక 'ఫోలే' (సౌండ్ డిజైనర్) ఆర్టిస్ట్. సినిమాలో ప్రతి చిన్న శబ్దాన్ని సహజంగా రికార్డ్ చేయడం ఇతని పని. అయితే వరుణ్‌కు చిన్నప్పటి నుండి 'సుయోధన' అనే ఒక వింత శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దం విన్నప్పుడల్లా అతనికి దుర్యోధనుడి ఆకారం కళ్ళ ముందు కనిపిస్తూ భయపెడుతుంటుంది. మరోవైపు వరుణ్ తండ్రి మద్దులూరి ప్రకాష్ (సాయి కుమార్) ఒక నాటక కళాకారుడు, రాజకీయ నాయకుడు. ఒకానొక దశలో వరుణ్‌కు తన తండ్రిలోనే దుర్యోధనుడు కనిపిస్తాడు. ఈ క్రమంలోనే ప్రకాష్ హత్యకు గురవుతాడు. అసలు వరుణ్‌కు ఆ శబ్దం ఎందుకు వినిపిస్తుంది? తన తండ్రిని చంపింది ఎవరు? ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
'సుయోధన' సినిమాని దర్శకుడు వైఎస్ మాధవ్ రెడ్డి ఉత్కంఠభరితంగా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం నుంచే ఒక విధమైన సస్పెన్స్‌ను మెయింటైన్ చేస్తూ, ప్రేక్షకులలో ‘తర్వాతి సీన్ ఏంటి?’ అనే క్యూరియాసిటీని పెంచడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ‘సౌండ్’ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడం విశేషం.
దర్శకుడు ఎంచుకున్న 'ఫోలే ఆర్టిస్ట్' అనే బ్యాక్‌డ్రాప్ తెలుగు ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. దానిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా బాగుంది. సినిమాలో శబ్దాల ప్రాముఖ్యతను ఆయన ఎంతో బలంగా చూపించాడు. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగినా.. ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్టులు ఆ లోటును భర్తీ చేస్తాయి. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ లో పొలిటికల్ డ్రామా, మదర్ సెంటిమెంట్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి.
‘సుయోధన’ ఒక సాలిడ్ మిస్టరీ థ్రిల్లర్. రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా ఒక కొత్త తరహా మిస్టరీని చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. సస్పెన్స్, ఎమోషన్, టెక్నికల్ వాల్యూస్ కలగలిసిన ఈ సినిమాలో.. ముఖ్యంగా సౌండ్ డిజైనింగ్‌ను కథలో వాడుకున్న విధానం మెప్పించింది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
ప్రియదర్శి మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. భయాందోళనలకు గురయ్యే యువకుడిగా, తన తండ్రి మరణం వెనుక రహస్యాన్ని ఛేదించే కొడుకుగా ఆయన పండించిన ఎమోషన్స్ హైలైట్‌గా నిలిచాయి. ఇక 'డైలాగ్ కింగ్' సాయి కుమార్ తన గాంభీర్యమైన నటనతో సినిమాకు వెన్నెముకలా నిలిచారు. సీనియర్ నటి ప్రేమ తల్లి పాత్రలో ఒదిగిపోగా, హీరోయిన్ ద్రిషిక చందర్ తన పరిధి మేరకు బాగా నటించింది.
సాంకేతికంగా ఈ సినిమా రిచ్‌గా ఉంది. జై క్రిష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్ థ్రిల్లర్ మూడ్‌ను అద్భుతంగా ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్ గా...
వినూత్నమైన కాన్సెప్ట్ తో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ 'సుయోధన'. అక్కడక్కడా కొంచెం ల్యాగ్ అనిపించినా, ఓవరాల్‌గా థ్రిల్లర్ ప్రియులను మెప్పించే చిత్రం ఇది.
రేటింగ్: 2.5/5
Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.
![]() |
![]() |