![]() |
![]() |

ఈ డిజిటల్ యుగంలో చిత్రసీమలో సరికొత్త ట్రెండ్స్ నడుస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే ముందు ఎంత సందడి చేస్తాయో, మరికొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చే ముందు కూడా అంతకంటే ఎక్కువ ప్రచారం పొందుతాయి. కానీ, ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్‌గా డిజిటల్ వేదికపై ప్రత్యక్షమయ్యే సినిమాల సంఖ్య కూడా ఇటీవల పెరుగుతోంది. అదే కోవలో ఇప్పుడు టాలీవుడ్‌కి చెందిన ఒక ఆసక్తికరమైన కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు సడన్‌గా వచ్చేసింది.
కమెడియన్ సప్తగిరి, రాజ్ కసిరాజు, నూతన నటుడు పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పురుషః'. మే 22, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే, తాజాగా ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండా నేరుగా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చి సినీ ప్రియులను ఆశ్చర్యపరిచింది.
ఈ చిత్రం ప్రధానంగా భార్యాభర్తల మధ్య జరిగే మనస్పర్ధలు, వైవాహిక బంధాల్లో వచ్చే సమస్యలను హాస్యభరితంగా తెరకెక్కించిన తీరుతో సాగుతుంది. కథ విషయానికి వస్తే.. చిన్ననాటి నుండి ప్రాణస్నేహితులైన గోవింద్ (పవన్ కల్యాణ్), సత్తిబాబు (సప్తగిరి), శ్రీను (రాజ్ కసిరెడ్డి, కిస్ (వెన్నెల కిశోర్) ప్రతీ విషయాన్ని పరస్పరం పంచుకుంటూ పెరిగి పెద్దవుతారు. ఆ తర్వాత గోవింద్ కమల (రాయంచ)ను ప్రేమించి పెళ్లి చేసుకోగా, సత్తిబాబుకు లక్ష్మి (హాసిని)తో, అలాగే శ్రీనుకు గీత (విషిక)తో వివాహం జరుగుతుంది. జీవితం ఎంతో సంతోషంగా సాగుతుందని భావించిన ఈ ముగ్గురు స్నేహితులకు భార్యలతో నిత్యం గొడవలు రావడం మొదలవుతుంది. ఈ గొడవలతో తీవ్రంగా విసిగిపోయిన భార్యలు ముగ్గురూ తమకు విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కుతారు. విడాకుల కేసుల విచారణ కోసం భర్తలు కోర్టు చుట్టూ తిరుగుతుంటారు కానీ, భార్యలు మాత్రం కోర్టుకు హాజరుకాకపోవడంతో జడ్జికి అనుమానం వస్తుంది.
కోర్టులో కేసు విచారిస్తున్న జడ్జి (వీటీవీ గణేష్) అసలు ఈ భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం ఏంటి, సమస్య ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అసలు గోవింద్, కమల ప్రేమకథ ఎలా మొదలైంది? సత్తిబాబు, శ్రీనులపై వారి భార్యలకు అంత అనుమానం రావడానికి వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? వీరి ముగ్గురి కాపురాల్లో నిప్పులు పోయడంలో స్నేహితుడు 'కిస్' పాత్ర ఏంటి? చివరికి జడ్జి సమక్షంలో ఈ మూడు జంటల కథ ఎలాంటి మలుపు తిరిగి సుఖాంతమైంది అనేదే 'పురుషః' చిత్ర ముఖ్య కథాంశం.
వీరూ ఉలవల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలోరాజీవ్ కనకాల, పమ్మి సాయి వంటి నటులు కూడా కీలక పాత్రల్లో మెరిశారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నపాటి అనుమానాలు ఎలాంటి పరిస్థితికి దారితీస్తాయో సరదాగా చూడాలనుకునే వారు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.
Purushaha, OTT Release, Telugu Comedy, Saptagiri, Vennela Kishore
![]() |
![]() |