![]() |
![]() |

తెలంగాణ జానపద గీతాలతో యూట్యూబ్ వేదికగా విపరీతమైన ప్రజాదరణ సంపాదించుకున్న తెలుగమ్మాయి నాగదుర్గ ఇప్పుడు వెండితెరపై తన ముద్ర వేస్తోంది. యూట్యూబ్‌లో తనదైన పాటలు, డ్యాన్సులతో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించిన నాగదుర్గ, హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం 'లవ్ ఓ లవ్'. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా నటించారు. గతంలో ధనుష్ దర్శకత్వం వహించిన 'నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబం' (జాబిలమ్మా నీకు అంత కోపమా) చిత్రంతో తెరంగేట్రం చేసిన పవిష్ నారాయణ్‌కి ఇది రెండవ చిత్రం కావడం విశేషం.
'లవ్ ఓ లవ్' మూవీ జూలై 10న థియేటర్లలో విడుదలైంది. అయితే, థియేటర్లలో విడుదలైన కేవలం 3 వారాల వ్యవధిలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం కావడం విశేషం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, జూలై 31 నుండి ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళంతో పాటు తెలుగు భాషలో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
మహేష్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామాలో భారీ తారగణం నటించింది. ప్రముఖ దర్శకుడు, నటుడు సెల్వరాఘవన్, సీనియర్ దర్శకుడు కె.ఎస్. రవికుమార్, వనితా విజయ్ కుమార్, రమ్య, ఆదిత్య కతిర్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించారు. ఒక కార్పొరేట్ ఉద్యోగి తన గర్ల్ ఫ్రెండ్ చేసిన విలాసవంతమైన ఖర్చుల వల్ల క్రెడిట్ కార్డ్ బిల్లులు పెరిగిపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన సమయంలో ఎదుర్కొన్న సవాళ్లను పోలీస్ స్టేషన్‌లో కథగా వివరించే కామెడీ నేపధ్యంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.
Love Oh Love, OTT Release, Naga Durga, Pavish Narayan
![]() |
![]() |