![]() |
![]() |

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అల్లు అర్జున్ (Allu Arjun) చేసిన ఓ పని తెలుగునాట సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మెగా కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో పాటు, ఏపీ రాజకీయాల్లో కీలంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు మెగా ఫ్యామిలీతో పాటు, దాదాపు సినీ పరిశ్రమ అంతా అండగా నిలిచింది. అల్లు అర్జున్ కూడా పవన్ కి మద్దతుగా ట్వీట్ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా, ఆ తర్వాత బన్నీ ఊహించని షాకిచ్చారు. పవన్ కి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థికి బన్నీ మద్దతు తెలిపారు.
నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని స్వయంగా వెళ్లి కలిసిన అల్లు అర్జున్.. ఆయన విజయం సాధించాలని ఆకాక్షించారు. ఇది మెగా అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి గెలుపుని ఆకాంక్షిస్తూ అక్కడికి వెళ్లడం ఏంటంటూ.. సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బన్నీ దీనిపై క్లారిటీ ఇచ్చి ఫ్యాన్స్ ని కూల్ చేసే ప్రయత్నం చేశారు. తాను ఏ పార్టీ తరపునా వెళ్లలేదని, తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం వెళ్లాలని చెప్పారు. పార్టీలకు అతీతంగా తన కుటుంబసభ్యుల, స్నేహితుల విజయాన్ని ఎప్పుడూ కోరుకుంటాడని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఈ స్టేట్ మెంట్ తో మెగా ఫ్యాన్స్ కూల్ అవ్వలేదు. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ మరింత సంచలనంగా మారింది.

మే 13న ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిశాక, నాగబాబు చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. "మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే." అని నాగబాబు ట్వీట్ చేశారు. అయితే లో ఈ ట్వీట్ లో.. మొదటి లైన్ అల్లు అర్జున్ ని, రెండో లైన్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మని ఉద్దేశించి చేసినట్లు ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఏపీలో ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా పిఠాపురం సీటు జనసేనకి కేటాయించినప్పటికీ.. పవన్ కళ్యాణ్ గెలుపుని కోరుతూ టీడీపీ నేత వర్మ ఎంతో కష్టపడి పనిచేశారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ "మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే." అంటూ వర్మని ఉద్దేశించి నాగబాబు అన్నారని అంటున్నారు. ఇక అల్లు అర్జున్, తమ వాడు అయ్యుండి కూడా.. ఎన్నికల వేళ ఎంత నెగటివ్ అవుతుందనేది ఆలోచించకుండా.. వైసీపీ నాయకుడికి మద్దతు తెలపడంతో.. "మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు.. మావాడైనా పరాయివాడే." అంటూ నాగబాబు ఘాటుగా స్పందించారని చెబుతున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ పేరు ప్రస్తావించకుండానే నాగబాబు గట్టి కౌంటర్ ఇచ్చారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
![]() |
![]() |