![]() |
![]() |

మెగా హీరోల ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్లు, ఎన్నో రికార్డులు ఉన్నాయి. అలాంటి మెగా ఫ్యామిలీ గత రెండేళ్లలో వరుసగా ఎనిమిది పరాజయాలను చూసింది. దీంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. సెప్టెంబర్ 25న విడుదల కానున్న పవన్ కళ్యాణ్ 'ఓజీ'పైనే వారు తమ ఆశలన్నీ పెట్టుకున్నారు. (They Call Him OG)
మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి బిగ్ స్టార్స్ తో పాటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి యంగ్ హీరోలు కూడా ఉన్నారు. అయితే గత రెండేళ్లలో వీరి నుంచి ఎనిమిది సినిమాలు రాగా.. అన్నీ పరాజయం పాలయ్యాయి. 'బ్రో' సినిమా నుంచి ఈ ఫ్లాప్ ల పరంపర మొదలైంది.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' మూవీ 2023 జూలైలో విడుదలై ఫ్లాప్ గా నిలిచింది. అదే ఏడాది ఆగష్టులో చిరంజీవి 'భోళాశంకర్', వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున', నవంబర్ లో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' విడుదల కాగా.. మూడూ పరాజయం పాలయ్యాయి. 2024 లో వరుణ్ తేజ్ సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. మార్చిలో 'ఆపరేషన్ వాలెంటైన్', నవంబర్ లో 'మట్కా' రిలీజ్ కాగా.. రెండూ డిజాస్టర్ అయ్యాయి. ఇక 2025 ను కూడా ఫ్లాప్ తోనే ప్రారంభించింది మెగా ఫ్యామిలీ. రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదలై ఘోర పరాజయాన్ని చూసింది. పవన్ కళ్యాణ్ గత చిత్రం 'హరి హర వీరమల్లు' సైతం జూలై 24న ప్రేక్షకుల ముందు నిలిచి, మెగా ఫ్యామిలీ ఖాతాలో మరో ఫ్లాప్ ని చేర్చింది.
ఇలా 2023 జూలై నుంచి ఈ రెండేళ్లలో మెగా ఫ్యామిలీ ఏకంగా ఎనిమిది ఫ్లాప్ లు చూసింది. ఈ ఫ్లాప్ ల నుంచి మెగా ఫ్యామిలీని మళ్ళీ హిట్ ట్రాక్ లోకి తీసుకొచ్చే సినిమా 'ఓజీ' అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అభిమానుల్లో మాత్రమే కాకూండా, ప్రేక్షకుల్లో కూడా 'ఓజీ'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. రిలీజ్ కి ముందే ప్రీ సేల్స్ పరంగా ఓవర్సీస్ లో ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. రిలీజ్ తర్వాత వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. మరి ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్న విజయం వస్తుందేమో చూడాలి.
![]() |
![]() |