![]() |
![]() |

ఆగస్టు 9న తన బర్త్ డే సందర్భంగా అభిమానులు అందరూ ఓ మంచి కార్యక్రమం చేపట్టాలని సూపర్ స్టార్ మహేష్ బాబు కోరారు. తన పుట్టిన రోజు కానుకగా, ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ తలపెట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' కు మద్దతుగా తన బర్త్ డే నాడు ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని ఇన్స్టాగ్రాం ద్వారా మహేష్ కోరారు. పర్యావరణ సమతుల్యత కాపాడటానికి, కాలుష్యాన్ని నివారించడానికి మొక్కలు నాటి తన మీద ప్రేమను తెలియజేయాలని అన్నారు. "నా మీద ప్రేమతో మీరు చేసే పనులన్ని నాకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తాయి. ఈ సంవత్సరం మిమ్మల్ని స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మద్ధతుగా నా పుట్టిన రోజున ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటండి. మొక్కలు నాటే ఫోటోలను షేర్ చేస్తూ నన్ను ట్యాగ్ చేయండి. నేను కూడా వాటిని చూడగలను'' అని మహేష్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

కాగా మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆగష్టు 9న మహేష్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ రానుందని సమాచారం. ఈ సినిమా 2022 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |