![]() |
![]() |

ఈ ఏడాది 'ఆర్ఆర్ఆర్'తో సంచలన విజయాన్ని అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ వెంటనే 'ఆచార్య'తో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అందుకే తన తదుపరి సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం చరణ్ తన 15 సినిమాని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత తన 16వ సినిమాని 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నాడు. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ ని చరణ్ పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
తెలుగులో 'మళ్ళీ రావా', 'జెర్సీ' సినిమాలతో ఆకట్టుకున్న గౌతమ్.. హిందీలో మాత్రం జెర్సీ రీమేక్ తో పరాజయాన్ని అందుకున్నాడు. అయితే ఈ యంగ్ డైరెక్టర్ ఏకంగా చరణ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకోవడం పలువురిని ఆశ్చర్యపరిచింది. గౌతమ్ టాలెంట్, ఆయన చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతోనే చరణ్ ఈ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే 'ఆచార్య' షాక్ తో ఆలోచనలో పడ్డ చరణ్, రిస్క్ చేయడం ఇష్టంలేక ప్రాజెక్ట్ ని పక్కన పెట్టినట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది. 'బాహుబలి' తరవాత ప్రభాస్ కూడా ఇలాగే యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చి 'సాహో', 'రాధేశ్యామ్' రూపంలో ప్లాప్స్ ఎదుర్కొన్నాడు. అది కూడా ఓ రకంగా చరణ్ వెనకడుగు వేయడానికి కారణమని వార్తలొస్తున్నాయి.
అయితే గౌతమ్ ప్రాజెక్ట్ ని చరణ్ పక్కన పెట్టినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని మెగా సన్నిహిత వర్గాలు అంటున్నాయి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఈ ఏడాదే పట్టాలెక్కే అవకాశముందని చెబుతున్నారు. అంతేకాదు త్వరలోనే యూవీ క్రియేషన్స్ నుంచి అధికారిక అప్డేట్ కూడా రానుందని అంటున్నారు.
![]() |
![]() |