![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న 'డాన్స్ ఇండియా డాన్స్' షోలో తన ముద్దుల కూతురు సితారతో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేశాడు. ఆదివారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మహేష్ టీవీ షోలో సందడి చేయడం వెనుక భారీ డీల్ ఉన్నట్లు తెలుస్తోంది.
హీరోగా మహేష్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనతో తమ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవడానికి బడా బడా కంపెనీలు ఆసక్తి చూపిస్తుంటాయి. ఇప్పటికే ఆయన ఎన్నో బడా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. అదే బాటలో జీ తెలుగు సైతం మహేష్ క్రేజ్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని భావిస్తోందట. ఈ క్రమంలోనే తమ ఛానల్ కి చెందిన షోలు, సీరియల్స్ ని ప్రమోట్ చేయడం కోసం ఏడాదికి రూ.9 కోట్లు చెల్లించేలా మహేష్ తో డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ డీల్ లో భాగంగానే మహేష్ జీ తెలుగు కార్యక్రమాల్లో సందడి చేస్తున్నట్లు సమాచారం.

సినిమాల విషయానికొస్తే మహేష్ తన 28వ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు మహేష్. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశముంది.
![]() |
![]() |