![]() |
![]() |

స్టార్ హీరోలకు ఒక్కోసారి విచిత్ర పరిస్థితులు ఎదురవుతుంటాయి. త్వరలో విడుదల కాబోయే సినిమా కంటే కూడా.. ఆ తర్వాత రాబోయే సినిమాపై ఎక్కువ అంచనాలు ఏర్పడతాయి. ఆ సమయంలో హీరోలకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అటువంటి పరిస్థితే ఎదురైంది. (Pawan Kalyan)
రీసెంట్ గా 'హరి హర వీరమల్లు'తో ప్రేక్షకులను పలకరించిన పవన్ కళ్యాణ్.. త్వరలో 'ఓజీ'తో అలరించనున్నారు. అయితే ఈ రెండు సినిమాల విషయంలో.. 'ఓజీ'ని ఓన్ చేసుకున్నంతగా పవన్ అభిమానులు 'వీరమల్లు'ని ఓన్ చేసుకోలేదని చెప్పాలి. 'వీరమల్లు' ప్రమోషన్స్ సమయంలో కూడా ఫ్యాన్స్ "ఓజీ ఓజీ" అని పదే పదే అరిచేవారు. దీంతో స్వయంగా పవన్ కళ్యాణే 'రెండూ మన సినిమాలే' అని చెప్పాల్సి వచ్చింది.
అయితే పవన్ ఎంత చెప్పినా అభిమానులు 'వీరమల్లు'ని పూర్తిగా ఓన్ చేసుకోలేకపోయారనే చెప్పాలి. జూలై 24న విడుదలైన వీరమల్లు.. డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పై ట్రోల్ వచ్చాయి. ఫ్యాన్స్ కూడా ఎప్పటిలా ఈ సినిమాని భుజాన మోసి.. పవర్ స్టార్ రేంజ్ కి తగ్గ కనీస వసూళ్లను ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు 'విశ్వంభర' సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవిని ఆలోచనలో పడేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. (Chiranjeevi)
చిరంజీవి నుంచి తదుపరి రాబోతున్న రెండు చిత్రాలు.. ఒకటి 'విశ్వంభర' కాగా, మరొకటి 'మన శంకరవరప్రసాద్ గారు'. 'విశ్వంభర' అనేది వీఎఫ్ఎక్స్ తో ముడిపడిన భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ ఫిల్మ్ అయినప్పటికీ.. దీని కంటే 'మన శంకరవరప్రసాద్ గారు'పైనే అభిమానుల్లో ఎక్కువ అంచనాలు ఉన్నాయి. అందుకే 'విశ్వంభర'ను ఆలస్యంగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి 'విశ్వంభర' ఈ ఏడాది ప్రారంభంలో విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ ఆలస్యం, వీఎఫ్ఎక్స్ వర్క్ వంటి కారణాలతో వాయిదా పడింది. ఇటీవల షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. దీంతో 'విశ్వంభర' ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదలవుతుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా 2026 వేసవికి వాయిదా పడింది. ఓ రకంగా ఇది తెలివైన నిర్ణయమని చెప్పవచ్చు.
2026 సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్ గారు' విడుదలవుతోంది కాబట్టి.. ఇప్పుడు అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. పైగా 'విశ్వంభర' వీఎఫ్ఎక్స్ తో ముడిపడిన సినిమా కాబట్టి.. ఏదో కంగారు కంగారుగా పూర్తి చేసి విడుదల చేస్తే.. అనవసరంగా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే వీఎఫ్ఎక్స్ కి తగినంత సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తాజాగా విడుదలైన 'విశ్వంభర' స్పెషల్ గ్లింప్స్ లో వీఎఫ్ఎక్స్ ను గమనిస్తే.. టీజర్ కంటే చాలా బెటర్ గా ఉంది. సినిమా అవుట్ పుట్ కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో చివరి మూమెంట్ లో 'వీరమల్లు'ని వేగంగా పూర్తి చేసి విడుదల చేశారు. అదే వీఎఫ్ఎక్స్ పై ట్రోల్స్ కి కారణమైంది. అందుకే, 'విశ్వంభర' విషయంలో ఆ తప్పు జరగకూడదని పక్క ప్లాన్ తో వెళ్తున్నట్లు సమాచారం. మొత్తానికి.. సైలెంట్ గా వచ్చి, సాలిడ్ అవుట్ పుట్ తో అందరినీ సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతోనే.. చిరంజీవి వెనక్కి తగ్గినట్లు వినికిడి.
![]() |
![]() |