![]() |
![]() |

శివశక్తి దత్తా.. ఈ తరం వారికి ఈ పేరు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. తెలిసినా.. కీరవాణి తండ్రిగానో, రాజమౌళి తండ్రిగానో గుర్తుపెట్టుకుంటారు. కానీ, శివశక్తి దత్తా ఓ గొప్ప రచయిత. ఆయన కలం నుండి ఎన్నో గొప్ప రచనలు జాలువారాయి.
శివశక్తి దత్తా 1932 అక్టోబరు 8న జన్మించారు. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. ఆయన కుటుంబం రాజమండ్రి సమీపంలోని కోవూరుకు చెందినది.
శివశక్తి దత్తా ఏలూరు సి. ఆర్. రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతూ మధ్యలోనే చదువు ఆపేశారు. చిన్న వయస్సు నుండే కళల వైపు మొగ్గు చూపిన శివశక్తి దత్తా.. ఇంటి నుండి పారిపోయి ముంబై సర్ జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్ కళాశాలలో చేరారు. ఇంటి నుండి పారిపోయిన రెండు సంవత్సరాల తర్వాత.. డిప్లమా పట్టా అందుకుని కొవ్వూరుకు తిరిగి వచ్చారు.
కమలేష్ అనే కలం పేరుతో రచనలు చేసేవారు. తరువాత సుబ్బారావు అనే తన అసలు పేరును శివశక్తి దత్తాగా మార్చుకున్నారు. శివశక్తి దత్తాకు సంగీతంపై కూడా ఆసక్తి ఉండేది. గిటార్, సితార్, హార్మోనియం వాయించడం నేర్చుకున్నారు.
శివశక్తి దత్తాకు సినిమాలు మీద ఉన్న ఆసక్తి.. ఆయన్ని మద్రాసుకి వెళ్లేలా చేసింది. మద్రాసు వెళ్లి కొంతకాలం ఇద్దరు దర్శకుల వద్ద పనిచేసి.. ఆ తర్వాత పిల్లనగ్రోవి అనే సినిమాను ప్రారంభించారు. కానీ, ఆ సినిమా ఆర్థిక కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది.
తరువాత శివశక్తి దత్తాకు తన స్నేహితుడైన సమతా ముఖర్జీ ద్వారా.. దర్శకుడు కె. రాఘవేంద్రరావుతో పరిచయం ఏర్పడింది. రాఘవేంద్రరావు శివశక్తి దత్తాకు తన సినిమాలలో అవకాశాలు ఇచ్చేవారు. 'జానకి రాముడు'తో ఆయనకు రచయితగా మొదటి అవకాశం లభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.
శివశక్తి దత్తా.. సై, ఛత్రపతి, రాజన్న, బాహుబలి, ఆర్ఆర్ఆర్, హనుమాన్ వంటి సినిమాలకు సాహిత్యం అందించారు.
సై సినిమాలోని "నల్లా నల్లని కళ్ళ", ఛత్రపతి చిత్రంలోని "అగ్ని స్ఖలన, రాజన్న సినిమాలోని "అమ్మ అవని", బాహుబలి చిత్రంలోని "మమతల తల్లి", ఆర్ఆర్ఆర్ లోని "రామం రాఘవమ్" వంటి పాటలు ఆయనకు ఎంతో పేరు తీసుకొచ్చాయి.
శివశక్తి దత్తా 2007లో దర్శకుడిగా చంద్రహాస్ అనే సినిమా చేశారు.
శివశక్తి దత్తా కుటుంబ సభ్యులు సినీ రంగంలో గొప్పగా రాణిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి.. శివశక్తి దత్తా కుమారుడే. మరో కుమారుడు కల్యాణి మాలిక్ కూడా సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. అలాగే ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆయనకు సోదరుడు. దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళికి, సంగీత దర్శకురాలు ఎం. ఎం. శ్రీలేఖకు శివశక్తి దత్తా పెదనాన్న అవుతారు.
సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన శివశక్తి దత్తా.. 92 ఏళ్ల వయసులో జూలై 8, 2025న అనారోగ్యంతో కన్నుమూశారు.
![]() |
![]() |