Home  »  News  »  హృదయం మురళి మూవీ రివ్యూ

Updated : Jul 11, 2026

తారాగణం: అథర్వ, ప్రీతి ముకుందన్, కాయడు లోహర్, నట్టి సుబ్రమణ్యం, థమన్ ఎస్, నిహారిక ఎన్ఎమ్, రక్షణ్, ద్రావిడ్ సెల్వం, సుధాకర్, జోనితా గాంధీ, ఫహద్ ఫాజిల్, మాళవిక మోహనన్

సాంకేతిక బృందం:

రచన: ఆకాష్ భాస్కరన్, ద్రావిడ్ సెల్వం, ఎస్. రమణ గిరివాసన్

ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, సి.హెచ్. సాయి

కూర్పు: ప్రదీప్ ఇ. రాఘవ్

సంగీతం: థమన్ ఎస్

దర్శకత్వం, నిర్మాణం: ఆకాష్ భాస్కరన్

ఒకప్పటి సీనియర్ నటుడు మురళి కుమారుడైన అథర్వ, తన తండ్రికి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన 'హృదయం మురళి' అనే టైటిల్‌ తో  సినిమా చేస్తుండటం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ప్రీతి ముకుందన్, కయడు లోహర్, నిహారిక ఎన్ఎమ్, మాళవిక మోహనన్, ఫహద్ ఫాజిల్, థమన్ ఎస్ తదితరులు ఈ చిత్రంలో భాగం కావడం ప్రాజెక్ట్‌పై మరింత క్యూరియాసిటీని పెంచింది. ఎంతో నిరీక్షణ తర్వాత ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో వివరంగా చూద్దాం.

కథ:
హృదయం మురళి (Atharvaa) తన స్నేహితులతో కలిసి అమెరికా నుండి భారతదేశానికి తిరిగి వస్తుంటాడు. వాళ్లు ప్రయాణంలో ఒక అపరిచితుడితో (Fahadh Faasil) మాట్లాడుతూ,  మురళి ప్రేమకథలను చెప్పడం ప్రారంభిస్తారు. పాఠశాల దశలో ఉన్నప్పుడు, అతను తన టీచర్ గీత (Jonitha Gandhi)తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ప్లస్ వన్, ప్లస్ టూ సమయంలో సామ్ (Preity Mukundhan) ను ప్రేమిస్తాడు. ఇక కాలేజీ పూర్తయ్యాక తన వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో అమృత (Kayadu Lohar)పై మనసు పారేసుకుంటాడు. కానీ అతను తన భావాలను వారిలో ఎవరికీ వ్యక్తపరచలేకపోతాడు, కొంత కాలానికి  అతని మామ (Natty) అతనికి పెళ్లి నిశ్చయిస్తాడు. మరి మురళి తను నిజంగా ప్రేమించిన వ్యక్తి  ప్రేమను పొంది సంతోషంగా ఉన్నాడా  అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
అతిగా భావోద్వేగాలు పండించే దృశ్యాల కంటే, కాస్త నిగ్రహంతో నటించే సన్నివేశాల్లో అథర్వ చాలా సౌకర్యంగా కనిపించాడు. అతను రెండింటినీ ఒకేలా బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ రచయితలు బిడియాన్ని, ఆందోళనను, భావవ్యక్తీకరణ లోపాన్ని కలిపేసి గందరగోళానికి గురిచేశారు. ఒక పాత్ర తన భావాలను మాటల్లో చెప్పలేనంత సిగ్గుపడే స్వభావం కలదైతే, ఆ లక్షణం సినిమా ఆసాంతం కనిపించాలి కానీ ఎంపిక చేసిన కొన్ని చోట్ల మాత్రమే కాదు. ఒకవేళ ఆ ఆందోళన లేదా సిగ్గునే రచయితలు చూపించాలనుకున్నా, దానికి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేంత సమయం ఇవ్వాల్సింది.

'హృదయం మురళి' (Hrudayam Murali) కథలో ఒకదాని తర్వాత మరొక కీలక ఘట్టంలోకి దూసుకుపోవాలనే ఆత్రుత ఎక్కువగా కనిపించింది. నిశ్శబ్దంతో పండాల్సిన సన్నివేశాలను కూడా పాత్రల సంభాషణలు లేదా నేపథ్య సంగీతంతో నింపేయాలని చూశారు. కొన్ని సినిమాలు, పాత్రలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆత్మపరిశీలన, నిశ్శబ్దం, కాస్త స్పేస్ అవసరం. సినిమాలో ఉన్న ప్రతి పాత్రా హీరోకి ఏదో ఒక విధంగా సలహా ఇచ్చేలా డిజైన్ చేస్తే, ఇక హీరో ప్రయాణం ఎలా సాగుతుందనే భావన కలుగుతుంది.

దర్శకుడు ఆకాష్ భాస్కరన్ తెరపై ఎక్కడా ఖాళీ కనిపించకుండా ఫహద్ ఫాజిల్, రక్షణ్, ద్రావిడ్, సుధాకర్, థమన్, నిహారికతో పాటు జోనితా గాంధీ, మాళవిక మోహనన్, రైజా విల్సన్ లాంటి నటీనటులతో నింపేశాడు. కానీ స్క్రిప్ట్‌లోని ప్రధాన పాత్రలకు ఎప్పుడూ ఇతరుల సలహాలు అవసరమైనట్లుగా అనిపించదు. తమ అంతర్గత సంఘర్షణలను వారే సమర్థవంతంగా ఎదుర్కోగలరనిపిస్తుంది. ఎవరూ సలహాలు ఇవ్వని లేదా ప్రోత్సహించని ఇంటర్వెల్ ఎపిసోడ్‌లో కయడు లోహర్ మరియు అథర్వ మధ్య వచ్చే సన్నివేశాన్ని చూస్తే, ఆ ఇద్దరు ఆ క్షణాలను ఎంత సహజంగా పండించారో అర్థమవుతుంది.

ప్రీతి ముకుందన్ సన్నివేశాల్లో ఈ సహజత్వం లోపించింది. దీనివల్ల అసలైన ప్రేమకథ కంటే, స్నేహితుల గురించే ఈ సినిమా అన్నట్లుగా మారుతుంది. ఫస్ట్ హాఫ్‌లోని నాస్టాల్జిక్ మూమెంట్స్, ట్విస్ట్ బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ ఆ తర్వాత, ప్రధాన పాత్ర దాని నుండి ఎలా బయటపడాలని నిర్ణయించుకున్నాడనే దానికి సరైన సమాధానాలు దొరకవు. ఇంటర్వెల్ ఎపిసోడ్ తర్వాత కూడా దాని ప్రభావం పెద్దగా కనిపించదు. ముఖ్యంగా సెకండాఫ్‌లో టైటిల్ పాత్ర యొక్క పూర్తి కథను కాకుండా, కొన్ని ముక్కలు ముక్కలైన సన్నివేశాలను మాత్రమే చూస్తున్నామన్న భావన కలుగుతుంది. ఇది సినిమాకు మైనస్ అయింది.

అథర్వ తన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రీతి ముకుందన్ కూడా తనకు ఇచ్చిన పరిధిలో బాగా చేసింది. ఇంటర్వెల్, మార్ట్ సన్నివేశాల్లో కయడు లోహర్ తన బెస్ట్ ఇచ్చింది. ఫహద్ ఫాజిల్ పాత్రను సరిగ్గా వాడుకోలేదు. ద్రావిడ్, రక్షణ్ నవ్వించడంలో విఫలమయ్యారు. సుధాకర్ కొన్ని సన్నివేశాల్లో పర్వాలేదు. నిహారిక, థమన్ పాత్రలు చికాకు తెప్పిస్తాయి. థమన్ సంగీతం, నేపథ్య సంగీతం బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. అయితే మహిళలు తన ప్రేమను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నా, ఒక యువకుడు తన ప్రేమను వ్యక్తపరచలేకపోయే  సన్నివేశాలలో  పదే పదే అవే ఐడియాలు రిపీట్ చేయడం తో   సినిమా ఆసక్తిని కోల్పోయి ఒక డీసెంట్ అటెంప్ట్‌గా మిగిలిపోయింది.

పాజిటివ్స్:

అథర్వ, ప్రీతి ముకుందన్ సన్నివేశాలు

90ల నాటి నాస్టాల్జిక్ మూమెంట్స్

కయడు లోహర్ సన్నివేశాలు

ఇంటర్వెల్ ఎపిసోడ్

నేపథ్య సంగీతం

నెగటివ్స్:

థమన్ పాత్ర, నటన

సాగదీతగా, పదే పదే రిపీట్ అయ్యే సెకండాఫ్

పాత్రలు అతిగా మాట్లాడే సన్నివేశాలు

 

చివరి గా : డీసెంట్ ఎగ్జిక్యూషన్ ఉన్నప్పటికీ, రైటింగ్ మరీ రిపీటెడ్‌గా, గందరగోళంగా అనిపిస్తుంది.

 

రేటింగ్: 2.5/5

 

డిస్‌క్లైమర్: ఈ రివ్యూలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు/భావాలు పూర్తిగా రచయిత వ్యక్తిగతమైనవి, వీటికి సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు. వీటిపై స్పందించే ముందు పాఠకులు తమ సొంత విచక్షణను ఉపయోగించవలసిందిగా సూచిస్తున్నాము.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.