Home  »  News  »  Gurthukosthunnayi Review: 'గుర్తుకొస్తున్నాయి' వెబ్ సిరీస్ రివ్యూ.. '90s' మ్యాజిక్ రిపీట్ అయిందా?

Updated : Jul 4, 2026

ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీ వేదికగా రీసెంట్‌గా విడుదలైన వెబ్ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి'. 'బేబీ' ఫేమ్ విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా నటించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌ను దర్శకుడు వినోద్ గాలి మలిచారు. మొత్తం 7 ఎపిసోడ్‌లుగా, ప్రతి ఎపిసోడ్ సుమారు 30 నిమిషాల నిడివితో ఈ సిరీస్ రూపొందింది. శరత్ చంద్ర నాయుడు నిర్మించిన ఈ నోస్టాల్జియా డ్రామా, గతంలో సూపర్ హిట్ అయిన '90s' వెబ్ సిరీస్ తరహాలోనే ప్రేక్షకులను తమ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. (Gurthukosthunnayi Review)

కథ:
సంతోష్ (విరాజ్ అశ్విన్) చిన్నప్పటి నుంచి తన స్కూల్ హెడ్ మాస్టర్ రఘునాథ్ (ప్రియదర్శిని రామ్) కూతురైన వైశాలి (యశశ్రీ రావు)ని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఎన్నో కష్టాలు పడి, రఘునాథ్ పెట్టిన కఠినమైన టెస్టులన్నీ పాసై ఎట్టకేలకు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ సాధిస్తాడు.

పెళ్లి ఖరారైన ఆనందంలో సంతోష్ తన చిన్ననాటి స్నేహితులైన గణేష్ (వైవా రాఘవ), ఆనంద్ (గోదావరి గోపి), శ్రీకాంత్ (పవన్ సిద్ధు)లతో కలిసి బ్యాచిలర్ పార్టీ కోసం గోవా ప్లాన్ చేస్తాడు. అయితే, "జాతకం ప్రకారం పెళ్లికి ముందు సిటీ దాటకూడదు" అని మామగారు స్ట్రిక్ట్‌గా ఆర్డర్ వేసినా సంతోష్ వినకుండా దొంగచాటుగా గోవా బయల్దేరతాడు.

కానీ దారిలో ఊహించని యాక్సిడెంట్ జరిగి సంతోష్ తలకి బలమైన గాయమై గతం మర్చిపోతాడు. ఇంకో వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని హీరో ఇలా గజినీలా మారిపోయాడనే విషయం తెలిస్తే మామగారు రఘునాథ్ పెళ్లి క్యాన్సిల్ చేయడం ఖాయం. మరి ఈ నిజాన్ని దాచిపెట్టి ఫ్రెండ్స్, ఫ్యామిలీ కలిసి ఆ పెళ్లిని ఎలా జరిపించారు? సంతోష్‌కి గతం గుర్తుకొచ్చిందా? అనేదే మిగిలిన కథ.

విశ్లేషణ:
దర్శకుడు వినోద్ గాలి ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా, దాని చుట్టూ అల్లిన వినోదం, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సిరీస్ టైటిల్ వినగానే రవితేజ 'నా ఆటోగ్రాఫ్' సినిమాలోని సాంగ్ గుర్తొస్తుంది. ఈ సిరీస్ కూడా 90s, 2000s కిడ్స్‌కి తమ స్కూల్ రోజులను గుర్తుచేస్తూ మంచి నోస్టాల్జియా ఫీలింగ్‌ను ఇస్తుంది.

మామగారిని ఒప్పించడానికి హీరో పడే పాట్లు, గోవా ట్రిప్ వంటి సీన్లతో సిరీస్ కూల్‌గా స్టార్ట్ అవుతుంది. బాల్యానికి సంబంధించిన సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. ఎప్పుడైతే హీరోకి యాక్సిడెంట్ అయి మెమొరీ లాస్ అవుతుందో, అప్పటినుంచి అసలైన వినోదం మొదలవుతుంది. గతాన్ని మర్చిపోయిన హీరో చేసే పనులు, మామగారికి దొరికిపోకుండా ఫ్రెండ్స్ బ్యాచ్ చేసే కవరింగ్‌లు నవ్వులు పూయిస్తాయి. కేవలం కామెడీనే కాకుండా చివరి ఎపిసోడ్స్ వైపు వెళ్లేకొద్దీ వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ సీన్స్ కూడా బాగా వర్కవుట్ అయ్యాయి.

మొదటి నాలుగు ఎపిసోడ్లు.. చిన్ననాటి జ్ఞాపకాలు, అక్కడక్కడా కామెడీతో పరవాలేదు అన్నట్టుగా నడుస్తాయి. కానీ, చివరి మూడు ఎపిసోడ్లు మాత్రం కట్టిపడేశాయి. అమ్మమ్మ ఎపిసోడ్ అయితే.. ప్రతి ఒక్కరికి మళ్ళీ అమ్మమ్మ ఇంటికి వెళ్ళి రావాలనే ఫీలింగ్ ను కలిగిస్తుంది. అలాగే, ఫ్రెండ్స్ మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా లాస్ట్ ఎపిసోడ్ హృదయాలను హత్తుకునేలా ఉంది. సిరీస్ ను ముగించిన తీరు ఆకట్టుకుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
రాజ్ అశ్విన్ మెమరీ లాస్ బాధితుడిగా కామెడీ, సెంటిమెంట్ సీన్స్‌లో చక్కని నటన కనబరిచాడు. వైవా రాఘవ అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ పండించిన కామెడీ సిరీస్‌కు ప్రధాన బలం. హెడ్ మాస్టర్ రఘునాథ్ పాత్రకు ప్రియదర్శిని రామ్ సరిగ్గా సరిపోయారు. రోహిణి హట్టంగడి, శుభలేఖ సుధాకర్, గోపరాజు రమణ వంటి సీనియర్ నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

దర్శకుడు వినోద్ గాలి మెమొరీ లాస్ అనే పాత కాన్సెప్ట్‌నే తీసుకున్నప్పటికీ.. దానికి నోస్టాల్జియా, వెడ్డింగ్ బ్యాక్‌డ్రాప్ జోడించి.. కామెడీ, ఎమోషన్స్ తో బోర్ కొట్టకుండా ఫ్రెష్‌గా ప్రెజెంట్ చేశారు. అజయ్ అరసాడ అందించిన సంగీతం కథలోని ఫీల్‌ని బాగా ఎలివేట్ చేసింది. విజువల్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:
నటీనటుల పర్ఫార్మెన్స్
స్కూల్ డేస్ నోస్టాల్జియా & క్లీన్ కామెడీ
చివరి ఎపిసోడ్స్ లో ఎమోషన్స్

మైనస్ పాయింట్స్:
నెమ్మదిగా సాగే స్టార్టింగ్ ఎపిసోడ్స్

ఫైనల్ గా.. 
స్టార్టింగ్ ఎపిసోడ్స్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. కాసేపు హాయిగా నవ్వుకుంటూ, కాస్త ఎమోషనల్ ఫీల్ అయ్యే వెబ్ సిరీస్ చూడాలనుకుంటే 'గుర్తుకొస్తున్నాయి' మంచి ఛాయిస్.

రేటింగ్: 2.5/5

Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

 

 

Gurthukosthunnayi, Web Series, Review, Viraj Ashwin, ETV Win, TeluguOne

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.