![]() |
![]() |

ఆంధ్రప్రదేశ్ లో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. ఏపీ అసెంబ్లీ బరిలో ముగ్గురు సినీ ప్రముఖులు నిలిచారు. అందులో ఇద్దరు హ్యాట్రిక్ విజయంపై కన్నేయగా, ఒకరు మాత్రం మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ముగ్గురు ఎవరో కాదు.. నందమూరి బాలకృష్ణ, ఆర్.కె. రోజా, పవన్ కళ్యాణ్.
నందమూరి బాలకృష్ణ:
2014లో హిందూపురం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాలకృష్ణ(Nandamuri Balakrishna).. మంచి మెజారిటీతో గెలుపొంది, అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి, వరుసగా రెండోసారి మంచి మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హిందూపురం బరిలో నిలిచారు బాలకృష్ణ. ఆయన ఈ 2024 ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి.
రోజా:
ప్రముఖ నటి రోజా(Roja) దాదాపు పాతికేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. 2004 లో నగరి నుంచి, 2009 లో చంద్రగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2014 లో నగరి నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొంది, మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో కూడా నగరి నుంచి పోటీ చేసి వరుసగా రెండోసారి విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి నగరి నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే 2014, 2019 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతోనే గెలిచిన రోజాకు.. ఈసారి నగరిలో గెలుపు అంత తేలిక కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఆ అంచనాలను తలకిందులు చేస్తూ రోజా హ్యాట్రిక్ కొడతారేమో చూడాలి.
పవన్ కళ్యాణ్:
2014 లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. 2019 లో మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఆయన గాజువాక, భీమవరం స్థానాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా.. ఊహించని విధంగా రెండు చోట్లా ఓడిపోయారు. ఈసారి పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆయన భారీ మెజారిటీతో గెలిచి.. అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని అంటున్నారు.
![]() |
![]() |