![]() |
![]() |

ఏదైనా సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నప్పుడు మొదటి భాగం కంటే రెండో భాగానికి ఎక్కువ బడ్జెట్ పెట్టడం సహజం. అయితే మొదటి భాగం కంటే ఏకంగా 20 రెట్ల బడ్జెట్ రెండో భాగానికి పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ బడ్జెట్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. (Ee Nagaraniki Emaindi 2)
విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'ఈ నగరానికి ఏమైంది'. తరుణ్ భాస్కర్(Tharun Bhascker) దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా 2018 లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ, వరల్డ్ వైడ్ గా రూ.12 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'ఈ నగరానికి ఏమైంది-2' రూపొందుతోంది. (ENE 2)
'ఈ నగరానికి ఏమైంది-2' బడ్జెట్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై ఏకంగా రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగం గోవా నేపథ్యంలో తెరకెక్కగా, రెండో భాగం థాయిలాండ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు సమాచారం. భారీతనం, విదేశాల్లో చిత్రీకరణ, రెమ్యూనరేషన్స్ పెరిగిపోవడం ఇలా పలు కారణాల వల్ల బడ్జెట్ రూ.40 కోట్లకు చేరినట్లు వినికిడి. యూత్ లో ఈ సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా బాగానే వస్తాయనే నమ్మకంతో నిర్మాతలు ఇంత బడ్జెట్ పెడుతున్నట్లు ఇన్ సైడ్ టాక్.
కాగా, దర్శకుడిగా నెమ్మదిగా సినిమాలు చేస్తున్న తరుణ్ భాస్కర్ నటుడిగా మాత్రం బాగానే సినిమాలు చేస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన 'ఓం శాంతి శాంతి శాంతిః'(Om Shanti Shanti Shantihi) మూవీ జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |